మణిపూర్ లో మళ్లీ భయం.. భయం
ఇప్పటికే చాలామంది సొంత ప్రాంతాలకు వలస వెళ్లారు. కుకీ తెగ ప్రజలు మిజోరంలో తలదాచుకుంటున్నారు. మణిపూర్ అల్లర్లు తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం.
రిజర్వేషన్ల ప్రకటన కారణంగా ఆందోళనలు, అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ లో కాస్త విరామం తర్వాత మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైతై తెగవారు కుకీ తెగపై చేస్తున్న దాడుల కారణంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. సడలించిన కర్ఫ్యూ మళ్లీ మొదలైంది. మణిపూర్ వాసులు ఇల్లు దాటి బయటకు రాలేని వాతావరణం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. 10వేలమంది సైన్యం ప్రస్తుతం మణిపూర్ లో పహారా కాస్తోంది.
తాజా హింసకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్ల నేపథ్యంలో అటు సైన్యం రోడ్లపై కాపలా కాస్తోంది. మారుమూల గ్రామాల్లో లైనెన్స్ కలిగిన తుపాకులతో యువకులు రోడ్లపైకి వచ్చి నిలబడ్డారు. కుకీ తెగకి చెందిన గ్రామాల్లో మైతై వాలంటీర్లు ఇళ్లకు నిప్పు పెట్టి దాడులకు తెగబడుతున్నారనే వార్తలు వినపడుతున్నాయి. మైతై తెగకి సంబంధించిన ఆందోళనకారులు చర్చిలపై దాడులు చేస్తున్నారని స్థానిక మీడియా సంస్థల సమాచారం. తమని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారంటూ కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆరోపిస్తోంది. మణిపూర్ లో హింస కారణంగా ఇప్పటివరకు సుమారు 7 వేల మంది ప్రజలు మిజోరంకి వెళ్లిపోయారని అంటున్నారు. వీరిలో ఎక్కువశాతం కుకీ తెగ ప్రజలు ఉన్నారు.
బీజేపీ పాపం, మణిపూర్ కి శాపం..
బీజేపీ పాలిత మణిపూర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయం రెండు తెగల మధ్య చిచ్చు పెట్టింది. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చింది. మణిపూర్ నుంచి ఇప్పటికే చాలామంది సొంత ప్రాంతాలకు వలస వెళ్లారు. కుకీ తెగ ప్రజలు కూడా మిజోరంలో తలదాచుకుంటున్నారు. అల్లర్లు తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం.