మణిపూర్ ఘటనపై పోలీసు దర్యాప్తు అవసరమా..? సుప్రీం ఆగ్రహం
మణిపూర్ లో మహిళలపై అత్యాచారం జరిగిన ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి 14రోజులు సమయం తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనలో రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది.
మణిపూర్ అల్లర్లు, ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి అత్యాచారం చేసిన ఘటనలపై ఈరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ ఘటనలపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత మహిళలను సాయుధ మూకలకు అప్పగించిన పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేయడం సరికాదని చెప్పింది. సమగ్ర విచారణకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామంది. అందులో మహిళా జడ్జితోపాటు పలువురు న్యాయ నిపుణులు సభ్యులుగా ఉంటారని పేర్కొంది. కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఎఫ్ఐఆర్ కు 14రోజులా..?
మణిపూర్ లో మహిళలపై అత్యాచారం జరిగిన ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి 14రోజులు సమయం తీసుకోవడాన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనలో రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది. ఈ ఘటన మే 4న జరిగితే.. మే 18వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. అంతవరకు పోలీసులు ఏం చేశారని నిలదీసింది. జూన్ 24న దాన్ని మేజిస్ట్రేట్ కోర్టుకు ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారని కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు.
న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు తమకు కొంత సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అభ్యర్థించారు. ఈ సమాధానంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే సమయం మించిపోతోందని, సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణమే న్యాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. మణిపూర్ లో ఇప్పటివరకు నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను అందించాలని.. మణిపుర్ బాధిత కుటుంబాలకు ఏవిధమైన సాయం అందుతుందో తెలియజేయాలని పేర్కొంది.