ఎలుకను క్రూరంగా చంపిన వ్యక్తిపై కేసు నమోదు.. - 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
ఎలుక కళేబరాన్ని శవ పరీక్ష కోసం బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కి తీసుకెళ్లారు. ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షలో ఆ ఎలుక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మృతిచెందిందని నిర్ధారించారు.
ఎలుకను క్రూరంగా చంపాడని ఓ వ్యక్తిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు 30 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. గతేడాది నవంబరులో ఈ ఘటన జరగగా, అది చూసిన జంతు సంరక్షణ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో గతేడాది నవంబరులో మనోజ్‌కుమార్ అనే వ్యక్తి ఓ ఎలుక తోకకు రాయి కట్టి దానిని మురుగు కాలువలోకి విసిరేశాడు. జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ దానిని చూసి.. ఆ జంతువు పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాను ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించానని, అయితే అది అప్పటికే చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మనోజ్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 429తో పాటు జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఎలుక కళేబరాన్ని శవ పరీక్ష కోసం బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కి తీసుకెళ్లారు. ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షలో ఆ ఎలుక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మృతిచెందిందని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు బదాయూ న్యాయస్థానంలో నిందితుడిపై 30 పేజీల చార్జిషీటును తాజాగా సమర్పించారు.
ఈ వ్యవహారంపై ఓ సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితుడు దోషిగా తేలితే అతనికి జంతు హింస నిరోధక చట్టం కింద గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, ఐపీసీ సెక్షన్ 429 కింద ఐదేళ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశముందని వివరించారు.