తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు.. కత్తితో పొడిచి, యాసిడ్ పోసి హత్య
కనిపించకుండా పోయిన మహిళ హత్యకు గురైనట్లు గుర్తించారు పోలీసులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తీసుకున్న అప్పు తిరిగివ్వమన్నందుకు సహోద్యోగిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో టెక్నికల్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మొహమ్మద్ జకీర్.. అదే స్టేషన్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల మహిళ వద్ద రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు పథకం ప్రకారం ఆమెను హత్య చేశాడు. మెడపై పలుమార్లు కత్తితో పొడిచి, డెడ్‌బాడీని గుర్తు పట్టకుండా ముఖంపై యాసిడ్ పోశాడు. ఆమె డెడ్‌బాడీని 148 సెక్టార్‌లో గ్రేటర్ నోయిడా పోలీసులు రికవరీ చేశారు. ఈ ఘటన ఇప్పుడు ఢిల్లీలో సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 8న తన తల్లి కనిపించకుండా పోయిందని మృతురాలి కుమార్తె ఫిర్యాదు చేసింది. అయితే మరుసటి రోజు మృతురాలి కుటుంబ సభ్యులకు గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. కనిపించకుండా పోయిన మహిళ హత్యకు గురైనట్లు గుర్తించారు పోలీసులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 2 గంటలకు ఆమె ఆఫీసు బయటకు వెళ్లినట్లు గుర్తించారు. అదే రోజు జకీర్ సెలవులో ఉన్నాడని విచారణలో తేలింది. ఇక పోలీసులు జకీర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా..అతని మొబైల్ స్విచ్ఛాఫ్ వచ్చింది.
దాదాపు 60కి పైగా ప్రాంతాలు 20 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు జకీర్‌ను సుభాష్ విహార్‌లో అరెస్టు చేశారు. 2018-19 మధ్య కాలంలో నిందితుడు జకీర్‌కు స్టేషన్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల మహిళ 11 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది. డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసినందుకే హత్యచేసినట్లు జకీర్ విచారణలో అంగీకరించాడు. నోయిడాలోని నాలెడ్జ్ పార్క్‌కు తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపి, ముఖంపై యాసిడ్ పోసినట్లు ఒప్పుకున్నాడు. హత్య జరిగిన స్థలంలో యాసిడ్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.