Telugu Global
National

ప్రియురాలి గొంతు కోసి.. ఆ విషయాన్ని వాట్సాప్ స్టేటస్‌ పెట్టి..

ఇటీవల ఆషిక్, ఫౌసియా నగరంలోని ఓ హోటల్ గదిలో బస చేశారు. అక్కడ ఉన్నప్పుడే మరొకసారి వాళ్ల మధ్య ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో ఆషిక్ ఆవేశంతో కత్తితో ఫౌసియా గొంతు కోసి హత్య చేశాడు.

ప్రియురాలి గొంతు కోసి.. ఆ విషయాన్ని వాట్సాప్ స్టేటస్‌ పెట్టి..
X

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం జరిగింది. 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఆమె ప్రియుడు హత్య చేసి.. మృతదేహం ఫొటోను తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు. యువతి స్నేహితులు గుర్తించడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. ఫౌసియా అనే యువతి చెన్నై నగరం న్యూ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆషిక్ అనే యువకుడితో ఫౌసియా ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. వాళ్ళిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో ఆ ఇద్దరు చెన్నైలో ఓ గదిని అద్దెకి తీసుకొని కలిసి ఉన్నట్లు సమాచారం.

అయితే ఆషిక్ ఇటీవల మరో మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నట్లు ఫౌసియా గుర్తించింది. దీనిపై ఆమె ఆషిక్ ను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఇటీవల ఆషిక్, ఫౌసియా నగరంలోని ఓ హోటల్ గదిలో బస చేశారు. అక్కడ ఉన్నప్పుడే మరొకసారి వాళ్ల మధ్య ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో ఆషిక్ ఆవేశంతో కత్తితో ఫౌసియా గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆషిక్ మృతదేహాన్ని ఫొటో తీసి వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు. దీనిని ఫౌసియా స్నేహితులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఆషిక్, ఫౌసియా బస చేసిన హోటల్ గదికి వెళ్లి పరిశీలించగా యువతి మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ సహాయంతో ఆషిక్ ను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. వేరే మహిళతో సంబంధం ఉన్నట్లు ఫౌసియా ఆరోపించడంతో ఆగ్రహానికి గురైన ఆషిక్ ఆమెను హతమార్చినట్లు చెప్పారు.

First Published:  2 Dec 2023 11:17 PM IST
Next Story