Telugu Global
National

రాష్ డ్రైవింగ్‌కి మహారాష్ట్రలో మరో యువకుడి బలి

ప్రమాదంలో చనిపోయిన యువకుడిని పోలీసులు ఓం భలేరావుగా గుర్తించారు. గత నెలలో పూణేలో 17 ఏళ్ల మైనర్ యువకుడు కారులో ఓవర్ స్పీడ్ గా వెళ్తూ ఓ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు సాఫ్ట్ వేర్లు అక్కడికక్కడే మృతిచెందారు.

రాష్ డ్రైవింగ్‌కి మహారాష్ట్రలో మరో యువకుడి బలి
X

గత నెలలో మైనర్ యువకుడి రాష్ డ్రైవింగ్ కారణంగా మహారాష్ట్రలోని పూణేలో కారు బైక్ ను ఢీకొని ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. తాజాగా పూణే సమీపంలోనే మరో టీనేజర్ నడుపుతున్న కారు బైక్ ను ఢీకొని 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. శనివారం రాత్రి పూణే జిల్లా ఖేడ్ అలండి ఎమ్మెల్యే అయిన దిలీప్ మోహితే పాటిల్ మేనల్లుడు మయూర్ మోహితే పూణే -నాసిక్ జాతీయ రహదారిపై కారులో వెళ్తూ ఓ బైక్ ను ఢీకొన్నాడు.

ఈ ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మయూర్ మోహితేను అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తన మేనల్లుడు ఘటనా స్థలం నుంచి పారిపోలేదని, మద్యం కూడా సేవించలేదని ఎమ్మెల్యే దిలీప్ తెలిపారు.

ప్రమాదంలో చనిపోయిన యువకుడిని పోలీసులు ఓం భలేరావుగా గుర్తించారు. గత నెలలో పూణేలో 17 ఏళ్ల మైనర్ యువకుడు కారులో ఓవర్ స్పీడ్ గా వెళ్తూ ఓ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు సాఫ్ట్ వేర్లు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే ప్రమాదానికి కారణమైన మైనర్ కు కేవలం 15 గంటల్లోనే బెయిల్ రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును పక్కదోవ పట్టించడానికి అధికారులు, వైద్య బృందం ప్రయత్నించిందన్న ఆరోపణలపై కేసులు కూడా నమోదు అయ్యాయి.

ఈ నేపథ్యంలో పూణే ప్రాంతంలో మరోసారి రాష్ డ్రైవింగ్ కారణంగా యువకుడు మృతి చెందడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తి రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ పోలీసులు వెనకడుగు వేయలేదు. నిందితుడిని అరెస్టు చేశారు.

First Published:  23 Jun 2024 5:50 PM IST
Next Story