ప్రియురాలు కాదన్నదని.. హోం థియేటర్‌లో బాంబ్.. - వరుడు, అతని అన్న మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
హేమేంద్ర ఆ హోం థియేటర్‌ని బయటికి తీసి రూమ్‌లో సెట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వగానే అది పేలిపోయింది.
తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని సహించలేకపోయిన ఓ మాజీ ప్రియుడు కొత్త జంటను చంపాలనుకున్నాడు. హోం థియేటర్‌లో బాంబు పెట్టి పెళ్లికి గిఫ్ట్‌గా అందజేశాడు. ఆ బాంబు పేలి వరుడు, అతని అన్న మృతిచెందారు. వరుడి బంధువుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కబీర్‌ధామ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మేరవికి మార్చి 31న పక్క గ్రామానికి చెందిన వేరొక యువతితో వివాహం జరిగింది. ఈనెల 1వ తేదీన రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి ఒక హోం థియేటర్ గిఫ్ట్‌గా వచ్చింది.
సోమవారం హేమేంద్ర ఆ హోం థియేటర్‌ని బయటికి తీసి రూమ్‌లో సెట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వగానే అది పేలిపోయింది. ఈ ఘటనలో హేమేంద్ర మృతిచెందగా, అతని అన్న రాజ్‌కుమార్‌తో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. రాజ్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు కారణమైన నిందితుడు సర్దు స్వస్థలం మధ్యప్రదేశ్. అతనొక ఆటో మెకానిక్. గతంలో అతను ఇండోర్‌లో స్టోన్ క్రషర్ ప్లాంటులో పనిచేశాడు. ఆ అనుభవంతో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించి బాంబుల తయారీని నేర్చుకున్నాడు. అలా తయారు చేసిన బాంబునే తన ప్రియురాలిపై కక్ష తీర్చుకునేందుకు ఉపయోగించాడు. నిందితుడు సర్దు వివాహితుడు కావడం గమనార్హం.