జోడో యాత్రలో కలకలం.. యువకుడు ఆత్మహత్యాయత్నం
ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడి పేరు కుల్దీప్ శర్మ. హిందూ ద్రోహులు అంటూ నినాదాలు చేస్తూ అతను ఆత్మహత్య చేసుకోబోయినట్టు చుట్టుపక్కల ఉన్నవారు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. ప్రస్తుతం రాజస్థాన్ లోని కోట ప్రాంతంలో యాత్ర కొనసాగుతోంది. ఉదయం ఆరు గంటలకే కోటలోని సూర్యముఖి హనుమాన్ ఆలయం నుంచి యాత్ర మొదలు పెట్టారు రాహుల్ గాంధీ. కామర్స్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటున్న క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్త పెట్రోల్ పోసుకుని తనకి తాను నిప్పు పెట్టుకోబోయాడు. చుట్టుపక్కల ఉన్నవారు అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్యాయత్నంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది.
ఎవరా వ్యక్తి..?
ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడి పేరు కుల్దీప్ శర్మ. హిందూ ద్రోహులు అంటూ నినాదాలు చేస్తూ అతను ఆత్మహత్య చేసుకోబోయినట్టు చుట్టుపక్కల ఉన్నవారు చెబుతున్నారు. నా కుటుంబాన్ని చంపింది వారే, వాళ్లే హిందువులను చంపుతున్నారు.. అంటూ ఆ యువకుడు పెద్ద పెద్దగా నినాదాలు చేసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈలోగా చుట్టుపక్కలవారు అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ప్రస్తుతం కోట ప్రాంతంలో మంత్రి శాంతి ధరివాల్ బల ప్రదర్శన చేపట్టారు. సీఎం అశోక్ గెహ్లాత్ కి సన్నిహితుడైన శాంతి ధరివాల్ కోట ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో భారీగా యాత్రకోసం జనసమీకరణ చేపట్టారు. కోటలో ఓ చోట రాహుల్ గాంధీ సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని కొంతమంది లోపలికి దూసుకు రావాలని చూడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. తొక్కిసలాటను అదుపు చేశారు.
రేపు సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా యాత్రకు బ్రేక్ ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే సోనియా గాంధీ జైపూర్ చేరుకున్నారు. డిసెంబర్-9న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలసి ఆమె తన పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటున్నారు. అమ్మకోసం ఒకరోజు యాత్రకు బ్రేక్ ఇవ్వబోతున్నారు రాహుల్ గాంధీ.