Telugu Global
National

మీరు తమిళా.. హిందీనా.. అడిగి మరీ ఉత్తరాదివారిపై దాడి

తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్తున్న ఒక ట్రైన్ జనరల్ బోగీలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ప్రయాణిస్తున్నారు. ఆ బోగీ ఎక్కిన తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఉత్తరాది వ్యక్తులు కూర్చున్న చోటకి వచ్చాడు.

మీరు తమిళా.. హిందీనా.. అడిగి మరీ ఉత్తరాదివారిపై దాడి
X

హిందీ అనే పదం వినిపిస్తే చాలు తమిళనాడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తమపై బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, తమకు ఆ భాష అవసరం లేదంటూ ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. తమిళులకు స్వాతంత్రానికి ముందు నుంచే హిందీపై వ్యతిరేకత ఉన్నది. హిందీని అధికారిక భాషగా చేయొద్దంటూ జరిపిన హింసాత్మక ఆందోళనల్లో ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు మరోసారి తమిళనాడులో హిందీపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

హిందీయేతర రాష్ట్రాల్లో పాఠశాల స్థాయిలో విద్యార్థులు ప్రాంతీయ భాష ఇంగ్లీష్ తో పాటుగా హిందీ కూడా నేర్చుకోవాలంటూ కస్తూరి రంగన్ కమిటీ తన నివేదికలో సిఫార్సు చేయడంపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రైల్లో ప్రయాణిస్తున్న ఉత్తరాదివాసులపై తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి దాడి జరపడం సంచలనం సృష్టిస్తోంది. అదే పనిగా మీరు హిందీనా.. తమిళా.. అని ప్రశ్నించి మరీ అతడు దాడి చేయ‌డం కలకలం రేపుతోంది.

తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్తున్న ఒక ట్రైన్ జనరల్ బోగీలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ప్రయాణిస్తున్నారు. ఆ బోగీ ఎక్కిన తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఉత్తరాది వ్యక్తులు కూర్చున్న చోటకి వచ్చాడు. 'మీ భాష హిందీ నా.. తమిళా.. అని ప్రశ్నించాడు. వారు ఉత్తరాది ప్రాంతానికి చెందిన ఓ రాష్ట్రం పేరు చెప్పగా.. వెంటనే అతడు కోపంతో ఊగిపోతూ వారిపై దాడి చేయడం మొదలుపెట్టాడు. అసలు ఆ తమిళ వ్యక్తి తమపై ఎందుకు దాడి చేస్తున్నాడో కూడా వలస కార్మికులకు అర్థం కాలేదు.

తమిళలకు దక్కాల్సిన ఉద్యోగాలను ఉత్తరాది వాసులు కొల్లగొడుతున్నారని అతడు ఆరోపణలు చేస్తూ, తిడుతూ వలస కార్మికులపై చేయి చేసుకున్నాడు. బోగీలో ప్రయాణిస్తున్న వారు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన అతడు వినలేదు. ఇలా ఒకసారి కాదు.. పలుమార్లు తమిళనాడు వ్యక్తి ఉత్తరాది కార్మికులపై దాడి చేశాడు.

అయితే ఆ వ్యక్తి వలస కార్మికులపై దాడి చేస్తుండగా అదే బోగీలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఆ వీడియోను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ప్రస్తుతం వైరల్ గా మారి రైల్వే పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఈ ఘటనపై వారు కేసు నమోదు చేసుకున్నారు. వలస కార్మికులపై దాడి జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు గాలింపు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఇటువంటి దాడులకు పాల్పడితే సహించబోమని రైల్వే పోలీసులు హెచ్చరించారు.

First Published:  17 Feb 2023 6:55 PM IST
Next Story