ఆలయంలో నమాజ్ చేసిన వ్యక్తి అరెస్ట్
ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుడిలో నమాజ్ చేసిన వ్యక్తిని అన్వర్ గా గుర్తించినట్లు ఎస్పీ అభిషేక్ వర్మ తెలిపారు. అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ అమ్మవారి ఆలయంలో నమాజ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆలయాన్ని గంగాజలంతో రెండుసార్లు శుద్ధి చేశారు. రాష్ట్రంలోని హాపూర్ లో ఛండీ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయంలో శుక్రవారం వేకువజామున అమ్మవారికి తొలిపూజ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో భక్తుల వెంట ఓ వ్యక్తి గుడిలోకి ప్రవేశించాడు. భక్తులందరూ హారతి కోసం వేచి ఉండగా అతడు మాత్రం ఆలయ ఆవరణలో ఓ వస్త్రాన్ని నేలపై పరిచి నమాజ్ చేయడం ప్రారంభించాడు. ఇది చూసిన భక్తులు నివ్వెర పోయారు.
గుడికి వచ్చి నమాజ్ చేస్తున్న వ్యక్తిని భక్తులు, పూజారులు, ఆలయ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అతడిని వెంటనే ఆలయంలో నుంచి బయటికి పంపించారు. ఈ సంఘటనకు సంబంధించి ఆలయ కమిటీ ఆఫీసు బేరర్ సత్యనారాయణ్ అగర్వాల్ కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుడిలో నమాజ్ చేసిన వ్యక్తిని అన్వర్ గా గుర్తించినట్లు ఎస్పీ అభిషేక్ వర్మ తెలిపారు. అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి ముస్లిం వ్యక్తి నమాజ్ చేయడం పట్ల స్థానికంగా కలకలం రేగింది. ఆలయాల్లో భద్రత పెంచాలని హాపూర్ ఎమ్మెల్యే విజయ్ పాల్ అధతి అధికారులను కోరారు. ముస్లిం వ్యక్తి ఆలయంలోకి వచ్చి నమాజ్ చేయడంతో పూజారులు ఆలయాన్ని గంగాజలంతో రెండుసార్లు శుద్ధి చేశారు.