Telugu Global
National

బీజేపీకి 8 సార్లు ఓటేసిన యువకుడి అరెస్ట్

ఘటనపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయ్యింది. ఆ పోలింగ్ బూత్ అధికారులందరినీ సస్పెండ్ చేసింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

బీజేపీకి 8 సార్లు ఓటేసిన యువకుడి అరెస్ట్
X

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్‌లో బీజేపీ అభ్యర్థికి ఓ యువకుడు ఎనిమిది సార్లు ఓటేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసీ సీరియస్ అయింది. నిబంధనలు ఉల్లంఘించి 8 సార్లు ఓటేసిన యువకుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఫరూఖాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్ పుత్‌కు ఓ యువకుడు ఎనిమిది సార్లు ఓటు వేశాడు. ఓటేసేటప్పుడు సెల్ ఫోన్‌తో వీడియో తీసుకున్నాడు.

ఆ వీడియోను సదరు యువకుడు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్ తీసుకుపోవడానికే అనుమతి లేకుంటే దొంగఓట్లు వేసి పైగా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ సమాజ్ వాదీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ ఘటనపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయ్యింది. ఆ పోలింగ్ బూత్ అధికారులందరినీ సస్పెండ్ చేసింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనపై నయాగావ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దొంగ ఓటు వేసిన వ్యక్తి రంజన్ సింగ్ అని.. అతడి తండ్రి బీజేపీ నేత అనిల్ సింగ్‌గా గుర్తించిన పోలీసులు నిందితుడిని తాజాగా అరెస్టు చేశారు.

First Published:  20 May 2024 7:49 PM IST
Next Story