మమతా బెనర్జీకి కాంగ్రెస్ తో సఖ్యత కుదిరిందా..!
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌తో విభేదాలను విడనాడేందుకు మమత సిద్ధంగా ఉన్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు.
రానున్న సార్వ్రతిక ఎన్నికల్లో బిజెపిని గద్దె దించేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ కలిసి వస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆమె వైఖరిలో వచ్చిన మార్పులు ఈ అనుమానాలకు తావిస్తోంది. అయితే సీనియర్ రాజకీయ నేత, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) అధ్యక్షుడు శరద్ పవార్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆమె కాంగ్రెస్ సహిత విపక్ష కూటమికి మద్దతుగా ఉంటారనే భావన కలిగిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌తో విభేదాలను విడనాడేందుకు మమత సిద్ధంగా ఉన్నారని ,పవార్ చెప్పారు.
మరో వైపు ఆదివారంనాడు ఫతేబాద్ లో మాజీ ఉపప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఐఎన్ ఎల్ డి అధినేత ఓం ప్రకాష్ చౌతాలా ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేశారు. బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా చౌతాలా పలువురు విపక్ష నాయకులను ఆహ్వానించారు. శరద్ పవార్,లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, నితీష్ కుమార్,అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, సిపిఎం నాయకులు సీతారాం యేచూరి తదితర నాయకులు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కూడా ఆహ్వానం అందిందిని అంటున్నారు. అయితే ఈ సభకు హారయ్యే విషయంలో ఆయన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.
అయితే టిఎంసి నుంచి కొన్ని వ్యతిరేక గళాలు వినిపించినా మమత కాంగ్రెస్ తో కలిసి బిజెపి వ్యతిరేక పోరాటంలో పాల్గొనేందుకు సిద్ధమేనని అంటున్నారు. ఇప్పటివరకూ విపక్ష కూటమిలో కాంగ్రెస్ ఉంటే తాము కలవబోమంటూ కొంతమంది నేతలు ప్రకటనలు ఇచ్చారు. అయితే బిజెపిని గద్దె దించాలంటే విపక్షాలలో ఐకమత్యం అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలంటున్నారు పవార్ వంటి సీనియర్ నేతలు. కాంగ్రెస్ పార్టీ బలాన్ని తక్కువగా అంచనా వేయలేమని, ఆ పార్టీ ప్రాధాన్యం ఎంతో ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలను టిఎంసి సీనియర్ ఎంపి సౌగతా రాయ్ స్వాగతించారు, "ఇది మంచి ప్రకటన. శరద్ పవార్ దేశంలోనే చాలా సీనియర్ నాయకుడు, ఆయన మా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని సంప్రదించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని నేను అనుకోవడం లేదు." అన్నారు. కానీ, టిఎంసి రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ అయితే పవార్ ప్రకటనను విమర్శించారు. "ఇటువంటివన్నీ చెప్పమని ఎవరూ అతన్ని (పవార్) అడగలేదు. చౌతాలా ర్యాలీకి ముందు, ఆయన తన ప్రాముఖ్యతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు," అని ఓబ్రియన్ ఆరోపించారు. మరో సీనియర్ టిఎంసి నాయకుడు మాట్లాడుతూ .. "పార్టీ ఏ వైఖరి తీసుకున్నా (పవార్ ప్రకటనపై) మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ లేదా పార్టీ అధికారిక ప్రతినిధి మాత్రమే వివరిస్తారు. అదే పార్టీలో స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ అన్నారు.
టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్, పవార్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "కాంగ్రెస్ లేకుండా బీజేపీతో పోరాడాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. కాంగ్రెస్ కూడా తమ పాత్ర పోషించాలని మాత్రమే చెప్పాం. భారతదేశంలో, కనీసం 150 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ మాత్రమే బిజెపిని ఎదుర్కోగలదు. కాంగ్రెస్ తన పాత్రను పోషించకపోతే ఆ 150 స్థానాల్లో బీజేపీకి లాభం చేకూరుతుంది. ప్రతిపక్ష పార్టీల మధ్య కొంత సమన్వయం ఉండాలని మా ఛైర్‌పర్సన్ మమతా బెనర్జీ కూడా చెప్పారు. ప్రతిపక్ష పార్టీల సమన్వయ కమిటీ ఉండాలి, ఇది వారి రోడ్‌మ్యాప్‌ను నిర్ణయించడానికి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి. అప్పుడే బిజెపిని ధీటుగా ఎదుర్కోగలం" అన్నారు.
అయితే సిపిఎం మాత్రం మమత పాత్రను తేలిగ్గా తీసిపారేసింది. ఆమె ఇటీవల కాలంలో ఎలా ఉంటున్నారో అందరికీ తెలుసు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె ఎలా వ్యవహరించారో అంతా చూశారు. ఇటీవల టిఎంసి నాయకుల అరెస్టులు, తదనంతర పరిణామాల తర్వాత కూడా ఆమె వైఖరిలో మార్పు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె విశ్వసనీయత ప్రశ్నార్ధకమవుతందని సిపిఎం నేత సుజన్ చక్రవర్తి అన్నారు.
గత యేడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్.వామపక్ష పార్టీలు బిజెపికి సహాయం చేశాయంటూ మమత ఆరోపించారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత విపక్ష కూటమికి మమత నాయకత్వం అంటూ టిఎంసి అధికార పత్రిక 'జాగో బంగ్లా' పేర్కొంది. అప్పటినుంచి ఆమె కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. అంతేగాక ఆ పార్టీ కోమాలో ఉందని, ప్రభావం చూపలేని పార్టీగా అభివర్ణించారు కూడా.
ఇటీవల కాలంలో టిఎంసి సీనియర్ నాయకులు పార్ధా చటర్జీ (స్కూల్ జాబ్స్ కుంభకోణం), అనుబ్రత మోండల్ ( పశువుల స్మగ్లింగ్) స్కాంలలో చిక్కుకుని అరెస్టయ్యారు. అలాగే మరో ఇద్దరు పార్టీ నేతలు మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మోలోయ్ ఘటక్‌లను కూడా వివిధ ఏజెన్సీలు ప్రశ్నించాయి. "ఇటువంటి అనేక కేసులు ఉన్నాయి. అంతేగాక మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కు వస్తున్న భారీ సానుకూల స్పందన తరుణంలో మేము ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వాన్ని నేరుగా సవాలు చేసే స్థితిలో లేము" అని టిఎంసి సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.
కాగా టిఎంసి లో పవార్ వ్యాఖ్యలపై వస్తున్న విమర్శల గురించి ఎన్‌సీపి ప్రధాన అధికార ప్రతినిధి మహేష్ తపసే స్పందిస్తూ, పవార్ కానీ, ఎన్‌సిపి కానీ ఎప్పుడూ బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం పనిచేశాయని అన్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే మా ప్రయత్నం. మేము దానిని కొనసాగిస్తాము. పవార్ చాలా సీనియర్ నాయకుడు, ఏ ప్రకటన ఎప్పుడు చేయాలో..దానికి సరైన సమయం ఏమిటో బాగా తెలుసు. ప్రతిపక్షాల ఐక్యత ఆవశ్యకతను పవార్ పదేపదే ఉద్ఘాటిస్తున్నందున మేము ఈ సమయంలో ఎవరి వ్యాఖ్యలను పట్లించుకోవాల్సిన అవసరం లేదు, "అని మహేష్ అన్నారు.