Telugu Global
National

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: జీ-23 మరో నేతను రంగంలోకి దింపుతుందా..కొత్త‌గా రంగంలోకి ఖ‌ర్గే?

కాంగ్రెస్ అధ్యక్ష పోటీలో రోజుకో కొత్త అభ్యర్థి పేరు తెరమీదికి వస్తోంది. నిన్న రాత్రి వ‌ర‌కూ యువ‌కుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌తో అజ‌య్ మాకెన్‌, ముకుల్ వాస్నిక్ పేర్ల‌ను అధిష్టానం ప‌రిశీలించింది. కానీ చివ‌రి క్ష‌ణంలో ఖ‌ర్గే ను నామినేష‌న్ వేయాల్సిందిగా కోరింది.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: జీ-23 మరో నేతను రంగంలోకి దింపుతుందా..కొత్త‌గా రంగంలోకి ఖ‌ర్గే?
X

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అశోక్ గెహ్లాట్ అంకం ముగిసిపోయాక ఒక కొలిక్కి వ‌చ్చింద‌నుకుంటున్న త‌రుణంలో జి-23 లోని స‌భ్యుల‌ స‌మావేశం, అనంత‌ర వ్యాఖ్య‌లు ప‌లు ఊహాగానాలకు తావిస్తున్నాయి. వెళ్ళిన‌వారు వెళ్ళ‌గా జి-23లో మిగిలిన స‌భ్యులు గురువారం సాయంత్రం ఆనంద్ శర్మ ఇంట్లో సమావేశమై రాబోయే సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. వారు త‌ర్వాత చేసిన వ్యాఖ్య‌లు ద్వారా శశి థరూర్ అభ్యర్థిత్వానికి వారు స్పష్టంగా మద్దతు ఇవ్వడంలేదని తెలుస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా హాజరయ్యారు.

పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం ఈ గ్రూపు నుంచి శ‌శిథ‌రూర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. "ఇంకా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. అది పూర్తయిన తర్వాత, ఏం చేయాలో ఆలోచిస్తాం . ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైంది. బిఎస్ హుడా, ఆనంద్ శర్మ, పృథ్వీరాజ్ చవాన్ నేను తాజా ప‌రిణామాల‌పై చర్చించాము" అని ఆనంద్ శర్మ నివాసం వ‌ద్ద మనీష్ తివారీ చెప్పారు.

ఇప్పటివరకు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక‌ల‌కు తెర‌పైకి వ‌చ్చిన అభ్యర్థులకు జి-23 మద్దతు ఇస్తుందా అని అడిగిన ప్రశ్నకు తివారీ, "నామినేషన్ పత్రాలను సేకరించడం, దాఖలు చేయడం, ఉపసంహరించుకోవడం ఇవ‌న్నీ ఉన్నాయి క‌దా స‌రైన స‌మ‌యంలో నిర్ణయం తీసుకుంటారు. నామినేష‌న్ల చివ‌రి రోజు ఏమి జరుగుతుందో చూద్దాం.' అని అన్నారు.

'ప్రజాస్వామ్య పద్దతిలో పార్టీలో ఎన్నికలు జరగడం విశేషం. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తున్నందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపాం. ఎవరు నామినేషన్ వేస్తారో చూద్దాం. కొన్ని పేర్లు విన్నాం. రంగంలో ఉన్న ఉత్తమ అభ్యర్థికి మద్దతిస్తాం. " అని మ‌రో నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. శ‌శిథ‌రూర్ త‌మ ఆలోచ‌న‌ల‌ను వాణిని గ‌ట్టిగా వినిపించ‌గ‌ల‌రా అనే సందేహాలు ఈ నాయ‌కుల వ్యాఖ్య‌లు సూచిస్తున్నాయి.

కొత్త‌గా తెర‌పైకి ఖ‌ర్గే పేరు..

అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ వేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడిగా ఉన్న మ‌ల్లికార్ఝున ఖ‌ర్గేకు అధిష్టానం నుంచి వ‌ర్త‌మానం అందింది. నిన్న రాత్రి వ‌ర‌కూ యువ‌కుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌తో అజ‌య్ మాకెన్‌, ముకుల్ వాస్నిక్ పేర్ల‌ను కూడా అధిష్టానం ప‌రిశీలించింది. కానీ చివ‌రి క్ష‌ణంలో ఖ‌ర్గే ను నామినేష‌న్ వేయాల్సిందిగా కోరింది. ఈ ఎన్నిక‌ల్లో తాము త‌ట‌స్థంగా ఉంటామ‌ని చెబుతున్న గాంధీ కుటుంబం అభ్య‌ర్ధుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు ఆశ్చ‌ర్యం గొలుపుతోంది. ఈ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కూ నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ఉంది. ఖ‌ర్గేకు జి-23 స‌భ్యుడు హ‌ర్యానా మాజీ సిఎం భూపేంద్ర సింగ్ హుడా మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

First Published:  30 Sept 2022 11:41 AM IST
Next Story