Telugu Global
National

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే ఎన్నిక

పోలైన ఓట్లలో దాదాపు 90 శాతం ఓట్లు మల్లిఖార్జున్ ఖర్గేకే పడ్డాయి. ఖర్గేకు 7,897 ఓట్లు పోలవగా.. శశిథరూర్‌కు 1,072 మంది ఓటేశారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే ఎన్నిక
X

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించగా.. ఈ రోజు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 10 గంటలకు బ్యాలెట్ బాక్సులు తెరిచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపేశారు. ఏ రాష్ట్రానికి చెందిన బ్యాలెటో తెలియకుండా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత లెక్కింపు ప్రారంభించారు. 9,915 ఓటర్లను ఏఐసీసీ గుర్తించగా.. ఇందులో 9,500పైగా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1.00 గంట తర్వాత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.

పోలైన ఓట్లలో దాదాపు 90 శాతం ఓట్లు మల్లిఖార్జున్ ఖర్గేకే పడ్డాయి. ఖర్గేకు 7,897 మంది ఓటెయ్యగా.. శశిథరూర్‌కు 1,072 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఖర్గే అఖండ మెజారిటీతో అధ్యక్ష పదవి ఎన్నికల్లో గెలిచారు. సీతారాం కేసరి తర్వాత 24 ఏళ్లకు నాన్-గాంధీ ఫ్యామిలీ సభ్యుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఇక బాబూ జగ్జీవన్‌రామ్ తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయిన దళితుడిగా మల్లిఖార్జున్ ఖర్గే చరిత్ర సృష్టించారు.

కాగా, యూపీతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు శశిథరూర్ తరపున ఏజెంట్‌గా ఉన్న వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రికి లేఖ రాశారు. కాగా, ఈ విషయంపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. శశిథరూర్ ఆరోపణలపై పార్టీ దర్యాప్తు చేస్తుందని.. ప్రతీ ఒక్కరి అభిప్రాయాలను తీసుకోవడం పార్టీ ఆనవాయితి అని చెప్పుకొచ్చారు.

ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున్ ఖర్గేకు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఆయన పార్టీని చక్కగా నడిపిస్తారని అభిప్రాయపడ్డారు. పార్టీలో తన పాత్ర ఏమిటనేది కొత్త అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ డిసైడ్ చేస్తారని రాహుల్ చెప్పారు. మరోవైపు శశి థరూర్ కూడా ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది అత్యంత గౌరవమే కాకుండా.. ఎంతో బాధ్యతలో కూడుకున్నదని చెప్పారు. ఖర్గే ఈ పాత్రను విజయవంతంగా నెరవేరుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు వెయ్యి మందికి పైగా పార్టీ సహచరుల మద్దతు లభించినందుకు సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో నాలాంటి ఉత్సాహవంతులకు తప్పకుండా మద్దతు ఉంటుందనే సంకేతాలు ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పారు.

First Published:  19 Oct 2022 2:39 PM IST
Next Story