Telugu Global
National

మాల్దీవులు చైనాకు చేరువవుతున్నాయా? - భారత భద్రతకు ముప్పుగా పరిణమించేనా!

మాల్దీవులపై పట్టు కోసం భారత్, చైనా పోటీ పడుతున్న వేళ.. ఆ దేశ నూతన అధ్యక్షుడు మహ్మద్‌ మయిజ్జు మాల్దీవుల నుంచి భారత్‌ దళాలు వెళ్లిపోవాలని కోరారు.

మాల్దీవులు చైనాకు చేరువవుతున్నాయా?  - భారత భద్రతకు ముప్పుగా పరిణమించేనా!
X

మాల్దీవులు.. హిందూ మహాసముద్రంలో చిన్నదీవుల సమూహం. భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షదీవులకు దిగువన ఈ మాల్దీవులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే కీలకమైన సముద్రమార్గం ఇక్కడకు సమీపంలోనే ఉంది. మాల్దీవులపై పట్టు కోసం భారత్, చైనా పోటీ పడుతున్న వేళ.. ఆ దేశ నూతన అధ్యక్షుడు మహ్మద్‌ మయిజ్జు మాల్దీవుల నుంచి భారత్‌ దళాలు వెళ్లిపోవాలని కోరారు. ఆయన ఎన్నికైన రోజునే తన ఆలోచన బయటపెట్టగా.. తాజాగా మరోసారి ఈ ప్రకటన వెలువరించాడు. తాము పూర్తి స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు శనివారం ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మాల్దీవుల అధ్యక్షుడిగా మయిజ్జు ప్రమాణం చేసిన ఒక రోజు వ్యవధిలోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

తాజా ప్రకటనకు ముందే.. ప్రమాణస్వీకారానికి వచ్చిన భారత భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో మయిజ్జు.. ఈ అంశంపై చర్చించినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. భారత్‌కు చెందిన దాదాపు 70 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ ఉంటోంది. భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్‌ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సహకరిస్తాయి. తాను అధికారంలోకి వస్తే మాల్దీవుల్లోని భారత్‌ బలగాలను వెనక్కి పంపిస్తానని మయిజ్జు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాతి రోజునే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’మాల్దీవుల్లో ఇతర దేశాలకు చెందిన సైనికులెవరూ ఉండొద్దు’ అంటూ పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అత్యవసర వైద్య పరిస్థితులు తలెత్తినప్పుడు అక్కడి పౌరులను తరలించేందుకు భారతీయ హెలికాప్టర్లు, విమానాల సహకారం గురించి కిరణ్‌ రిజిజు వద్ద మయిజ్జు ప్రస్తావించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మారుమూల ద్వీపంలోనూ అంతర్జాతీయ పర్యాటకులు పోటెత్తడానికి ఈ భరోసా కూడా ప్రధానమైనదని ఆయన కొనియాడినట్లు తెలిపాయి. మాల్దీవుల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిరంతర సహకారం కోసం ఇరు దేశాలు ఆచరణీయమైన పరిష్కారాలను చర్చించేందుకు అంగీకారం కుదిరినట్లు చెప్పాయి.

First Published:  19 Nov 2023 8:39 AM IST
Next Story