అప్పులు తీర్చలేక భర్త ఆత్మహత్య.. కంపెనీని నిలబెట్టిన భార్య
మూడేళ్ల క్రితం అంటే 2019 మార్చి 31 నాటికి కంపెనీ అప్పులు రూ. 7,214 కోట్లుగా ఉండగా.. గతేడాది రూ. 1898 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది మరో రూ. 88 కోట్లు తగ్గిపోయాయి.
ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు ఇంట పుట్టిన బిడ్డ. తల్లిదండ్రులు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. ఇద్దరూ కలసి ఓ కాఫీ షాప్ పెట్టుకున్నారు. ఒక్క షాపుతో మొదలు పెట్టి దేశవ్యాప్తంగా వందల షాపులు, వేల వెండింగ్ మెషిన్లకు విస్తరించారు. ఇంతలోనే భారీ కుదుపు. సంస్థ నష్టాల బారిన పడటంతో అప్పులను తీర్చ లేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల్లో ఉన్న కంపెనీ, ఇంకా స్థిరపడని పిల్లలు. కంపెనీని అమ్మేయమని, దివాళా పిటిషన్ పెట్టమని చాలా మంది ఆమెకు చెప్పారు. కానీ ఎవరి మాటా వినలేదు. స్వయంగా కంపెనీ బాధ్యతలు తీసుకుంది. మూడేళ్ల క్రితం దాదాపు రూ. 7,200 కోట్ల అప్పున్న కంపెనీ.. ఇవ్వాళ క్రమంగా అప్పులు తీరుస్తూ మళ్లీ మార్కెట్‌లో నిలబడింది. ఇంకా రూ. 1800 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. కానీ రెండు మూడేళ్లలో వాటినీ తీర్చేస్తానని ఆమె చెప్తున్నారు. ఆమె పేరు మాళవిక. ఆ సంస్థ పేరు కేఫ్ కాఫీ డే.
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అప్పులు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది మార్చి చిరకు తమ కంపెనీ అప్పులు రూ. 1810 కోట్లుగా ఉన్నట్లు బుధవారం వెల్లడించిన తమ వార్షిక నివేదికలో పేర్కొన్నది. మూడేళ్ల క్రితం అంటే 2019 మార్చి 31 నాటికి కంపెనీ అప్పులు రూ. 7,214 కోట్లుగా ఉండగా.. గతేడాది రూ. 1898 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది మరో రూ. 88 కోట్లు తగ్గిపోయాయి. మరో రెండు మూడేళ్లలో కంపెనీకి చెందిన అప్పులన్నీ తీరిపోతాయని సీఈవో మాళవిక ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పడిలేచిన కంపెనీ..
కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కూతురే మాళవిక హేగ్డే. ఆమెకు 1991లో కాఫీ వ్యాపారం చేసే వీజీ సిద్ధార్థతో వివాహం జరిగింది. అనేక కాఫీ తోటలు, ఎగుమతుల బిజినెస్ ఉన్న సిద్ధార్థకు వినూత్నమైన కాఫీ షాప్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఈ క్రమంలో కేఫ్ కాఫీ డే అనే ఓ స్టోర్‌ను బెంగళూరులో తెరవాలని భావించారు. మొదట్లో మాళవిక కాఫీ షాప్ పెట్టడానికి పెద్దగా ఇష్టపడలేదు. ఎందుకంటే బయట రూ. 5కే కాఫీ దొరుకుతుంటే.. భర్త మాత్రం రూ. 25కి కాఫీ అమ్ముదామని చెబుతున్నాడు. దాంతో ఆమె ఆ ప్లాన్ నచ్చలేదని చెప్పింది. అయితే.. అప్పుడప్పుడే ఇండియాలో ఇంటర్నెట్‌కు వినియోగదారులు పెరుగుతున్నారు. దీంతో మన కాఫీ షాపుల్లో ఉచితంగా ఇంటర్నెట్‌ను అందిద్దాం అని అన్నాడు. ఆ ఆలోచన నచ్చడంతో బెంగళూరులో 1996లో తొలి కాఫీ డే షాప్ ప్రారంభమైంది.
మొదట్లో కాఫీ డే సూపర్ హిట్ అయ్యింది. బెంగళూరులో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే కాల క్రమంలో అనేక ఇతర బ్రాండ్లు కూడా మార్కెట్లోకి ప్రవేశించాయి. దీంతో కాఫీ డే నష్టాల బాట పట్టింది. కంపెనీకి నష్టాలు రావడం.. భారీగా అప్పులు పెరగడంతో సిద్ధార్థ తట్టుకోలేకపోయారు. ఆ ఒత్తిడి నుంచి బయటపడలేక 2019 జూలైలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మాళవిక జీవితం ఒక్కసారిగా బ్లాంక్ అయ్యింది. ఏం చేయాలో పాలుపోలేదు. రూ. 7వేల కోట్లకు పైగా అప్పులు ఉండటంతో కాఫీ డే దివాళా అంచున నిలిచింది. ఇక ఈ కంపెనీ సంగతి ఖతమ్ అని అందరూ అనుకున్నారు. సంస్థలోని 24 వేల మంది కార్మికుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. చాలా సార్లు జీతాల కోసం ధర్నాలు కూడా చేశారు. అప్పుడే మాళవిక కంపెనీ బాధ్యతలు చేపట్టారు. కాఫీ డేను అమ్మేదే లేదని.. ఇది తన భర్త కలల సంస్థ అని చెప్పి పూర్తి బాధ్యతలు భుజంపై వేసుకున్నారు.
2020 డిసెంబర్‌లో కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన మాళవిక హగ్డే.. క్రమంగా కంపెనీని గాడిలో పెట్టే చర్యలు తీసుకున్నారు. కోవిడ్ కారణంగా అప్పు కూడా మరింతగా పెరిగింది. అప్పుల వాళ్లు వెంటపడటం, చెక్కు బౌన్సింగ్ కేసులు ఆమెను ఇబ్బంది పెట్టినా.. వాటిని క్రమంగా పరిష్కరించారు. చాలా వరకు వెండింగ్ మెషిన్లను వెనక్కు రప్పించడమే కాకుండా.. ఎన్‌పీఏలను అమ్మేశారు. కాఫీ డే టెక్నాలజీస్‌ను కూడా వేరే సంస్థకు విక్రయించారు. ఇలా గుదిబండలన్నీ వదిలేసి.. కాఫీ వ్యాపారంపై ఫోకస్ చేశారు. క్రమంగా అప్పులు తీరుతుండటమే కాకుండా కాఫీ డేలు తిరిగి కళకళలాడాయి. ఉద్యోగుల్లో కూడా ఆమె పట్ల నమ్మకం పెరిగింది. అప్పటి వరకు అప్పులు తీర్చడమే కానీ.. నిధులు వచ్చే దారిలేకుండా పోయింది. అయితే మాళవిక సామర్థ్యాన్ని చూసిన టాటా గ్రూప్ కాఫీ డేలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించింది.
వాస్తవానికి కాఫీ డేలో మాళవికకు ఉన్నది 4 శాతం వాటానే. అవసరం అనుకుంటే దాన్ని వదిలేసుకొని తన దారి తాను చూసుకోవచ్చు. కానీ కంపెనీ బాధ్యత మొత్తం తన భుజాల మీద వేసుకొని అప్పులు తీరుస్తోంది. భర్త కలల కంపెనీని నిలబెట్టడానికి గత రెండున్నరేళ్లుగా చేస్తున్న కృషి ఫలిస్తోనే ఉన్నది. తాజాగా ప్రకటించిన వార్షిక ఆదాయం ఉద్యోగుల్లో కూడా ఉత్సాహాన్ని తెప్పిస్తోంది. ఇంకా నష్టాల్లోనే ఉన్నా త్వరలోనే అవన్నీ తీరిపోయి లాభాల బాట పడుతుందని ఉద్యోగులతో పాటు మార్కెట్ వర్గాలు కూడా ఆశిస్తున్నాయి. ఇది నిజంగా మాళవిక సక్సెస్ స్టోరీ అని చెప్పవచ్చు.