Telugu Global
National

జార్ఖండ్‌లో తప్పిన పెద్ద రైలు ప్రమాదం

పట్టాలపై ట్రాక్టర్ ఇరుక్కుపోయినట్లు ముందే పసిగట్టి బ్రేకులు వేయడంతో పెద్ద రైలు ప్రమాదం తప్పిందని సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని అద్రా డివిజన్ డీఆర్ఎం మనీష్ కుమార్ తెలిపారు.

జార్ఖండ్‌లో తప్పిన పెద్ద రైలు ప్రమాదం
X

లోకో పైల‌ట్‌ అప్రమత్తతతో జార్ఖండ్ రాష్ట్రంలో ఓ పెద్ద రైలు ప్రమాదం తప్పింది. యాక్సిడెంట్ కారణంగా ఓ ట్రాక్టర్ రైలు పట్టాలపై ఇరుక్కుపోగా ఎంతో సమయస్ఫూర్తి ప్రదర్శించిన లోకో పైల‌ట్‌ ప్రమాదాన్ని ముందే పసిగట్టి బ్రేకులు వేసి రైలును ఆపాడు. మంగళవారం రాత్రి న్యూఢిల్లీ - భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 22812) ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఈ రైలు మార్గమధ్యలో ఉండగా.. అదే మార్గంలో బొకారో జిల్లా భోజుడిహ్ రైల్వే స్టేషన్ సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద ఓ ట్రాక్టర్ వేగంగా వస్తూ రైల్వే గేటును మూసివేస్తున్నప్పుడు ఢీకొంది. దీంతో ట్రాక్టర్ రైల్వే గేటు, పట్టాల మధ్య ఇరుక్కుపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి రాజధాని ఎక్స్ ప్రెస్ సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ సమీపానికి చేరుకుంది. అయితే పట్టాలపై ఓ ట్రాక్టర్ అడ్డుగా ఉన్నట్లు లోకో పైల‌ట్ దూరం నుంచే గమనించాడు. వెంటనే అప్రమత్తమైన అతడు బ్రేకులు వేశాడు. దీంతో రైలు సంతాల్దిహ్ రైల్వే గేటు సమీపం వద్దకు వచ్చి ఆగిపోయింది.

పట్టాలపై ట్రాక్టర్ ఇరుక్కుపోయినట్లు ముందే పసిగట్టి బ్రేకులు వేయడంతో పెద్ద రైలు ప్రమాదం తప్పిందని సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని అద్రా డివిజన్ డీఆర్ఎం మనీష్ కుమార్ తెలిపారు. పట్టాలపై పడిపోయిన ట్రాక్టర్ ను అక్కడి నుంచి తొలగించిన తర్వాత తిరిగి రాజధాని ఎక్స్ ప్రెస్ బయలుదేరిందని, ఈ ఘటన వల్ల రైలు 45 నిమిషాలు ఆలస్యంగా వెళ్లినట్లు ఆయన చెప్పారు. రైల్వే గేట్ ను ఢీకొని పట్టాలపై ఆగిపోయిన ట్రాక్టర్ ను సీజ్ చేశామని, గేట్ మెన్‌ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

First Published:  7 Jun 2023 7:55 PM IST
Next Story