Telugu Global
National

గాంధీని మహిషాసురుడిగా దుర్గా మాత‌ కాళ్ళ కింద పెట్టిన హిందూ మహాసభ‌!

దుర్గామాత కాళ్ళకింద మహిషాసురుడు ఉండటం మనం చూశాం. అయితే మహిషాసురుడి స్థానంలో హిందూ మహాసభ గాంధీ మహాత్ముణ్ణి పెట్టింది. కోల్ కతా లో జరిగిన ఈ సంఘటన తీవ్ర వివాదాస్పదమయ్యింది.

గాంధీని మహిషాసురుడిగా దుర్గా మాత‌ కాళ్ళ కింద పెట్టిన హిందూ మహాసభ‌!
X

కోల్‌కతాలోని దక్షిణ శివార్లలోని కస్బాలో అఖిల భారతీయ హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో మహిషాసురునికి గాంధీ తల పెట్టిన‌ విగ్రహం పెట్టారు. ఆ విగ్రహాన్ని దుర్గా మాత కాళ్ళతో తొక్కుతూ ఉంటుంది.

ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు ఈ విగ్రహాన్ని గమనించి, రాష్ట్ర అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. పూజా నిర్వాహకులు మహాత్మా గాంధీని అలా ప్రదర్శించడం మానేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలతో పాటు పౌర సమాజం నుండి నిరసనలు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.

పోలీసులు నిర్వాహకులను సంప్రదించి గాంధీ అనుచరుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ విగ్రహాన్ని మార్చాలని కోరారు. అయితే నిర్వాహకులు విగ్రహంలో మార్పులు తీసుకురావడానికి మొదట్లో ఇష్టపడలేదు. అయితే, పెరుగుతున్న ఒత్తిళ్లతో, నిర్వాహకులు ఎట్టకేలకు గాంధీ విగ్రహానికి కళ్లద్దాలు తొలగించి విగ్రహం తలపై విగ్గు పెట్టారు.

అయితే, మహాత్మా గాంధీ విగ్రహాన్ని పోలిన మహిషాసుర విగ్రహాన్ని పెట్టడం ద్వారా తాము ఎలాంటి తప్పు చేయలేదని పూజ నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రధాన పూజా నిర్వాహకుల్లో ఒకరైన సుందరగిరి మహారాజ్ మాట్లాడుతూ, తాను అఖిల భారతీయ హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడినని, నిజాన్ని బహిరంగంగా మాట్లాడే సమయం వచ్చినందున మేమిలా చేశాం అన్నారు."ఇప్పుడు నిజం మాట్లాడటం ప్రతి హిందువు యొక్క విధి అని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

మరో పూజా నిర్వాహకుడు, అఖిల భార‌త‌ హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి మాట్లాడుతూ.. "మాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహిషాసుర విగ్రహం లుక్‌లో కొన్ని మార్పులు చేయకపోతే పూజా మండపాన్ని మూసివేస్తామని పోలీసు యంత్రాంగం మమ్మల్ని బెదిరించింది. చివరకు మరింత ఉద్రిక్తత నుండి తప్పించుకోవడానికి మేము కొన్ని మార్పులు తీసుకురావాల్సి వచ్చింది. " అన్నారాయన.

''మేము గాంధీని నిజమైన అసురుడిగా చూస్తాము. అయ‌నే నిజమైన అసురుడు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని ప్రమోట్ చేస్తోంది. అది తప్పు. గాంధీని అన్ని చోట్ల నుంచి తొలగించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర స్వాతంత్య్ర‌ సమరయోధుల విగ్రహాలు, ఫోటోలు పెట్టాలి." అని గోస్వామి అన్నారు.

కాగా హిందూ మహాసభ చేసిన ఈ నిర్వాకాన్ని కాంగ్రెస్, సీపీఎం పార్టీలు తీవ్రంగా ఖండించాయి.

"ఇప్పుడు, ప్రతిరోజూ గాంధీ తత్వాన్ని హత్య చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది సార్వత్రిక ఉత్సవంలో భారీ సంఖ్యలో పాల్గొనే ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం" అని సీపీఐ-ఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం అన్నారు.

మత హింసను అరికట్టాలని మహాత్మా గాంధీ నిరాహార దీక్షలు చేసిన కోల్‌కతా నగరంలోనే ఆయనకు అవమానం జరిగిందని పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లిప్తంగా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు.

First Published:  3 Oct 2022 8:22 AM GMT
Next Story