యువ రైతుకు అమ్మాయిని వెతికి పెట్టే బాధ్యత తీసుకున్న ఎమ్మెల్యే
పెళ్లి చేసుకోవడానికి తనకు ఒక అమ్మాయిని వెతికి పెట్టాల్సిందిగా సదరు యువరైతు విజ్ఞప్తి చేయగా, ఎమ్మెల్యే కూడా అతని పరిస్థితిని అర్థం చేసుకొని చాలా సానుకూలంగా స్వీకరించారు.
వయసు వచ్చినా పెళ్లి కాకపోతే ఆ బాధ వర్ణణాతీతం. పెళ్లి కాకపోయినా ఏమీ కాదులే అని సర్దుకుపోదాం అని మనం అనుకున్నా.. సమాజం ఊరుకోదు. ఇంకా పెళ్లి కాలేదా అంటూ వెక్కిరిస్తూ, వేధిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు దేశంలో చాలామంది యువకులకు ఇదో పెద్ద సమస్యగా మారిపోయింది. మరీ ముఖ్యంగా వ్యవసాయంలో ఉంటున్న యువతకు వివాహాలు జరగడం చాలా కష్టంగా మారింది.
అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసే అబ్బాయిలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండటంతో భారీగా భూములు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు వివాహాలు జరగడం లేదు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో అగ్రవర్ణాలకు చెందిన యువకులు ఆఖరికి కర్ణాటక వైపు వెళ్లి వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన అమ్మాయిలను వివాహాలు చేసుకుంటున్నారు. ఇది ఒక ప్రాంతంలో ఉన్న సమస్య కాదు. దేశం మొత్తం ఈ సమస్య ఉంది.
మహారాష్ట్రలో ఒక యువరైతు నేరుగా తమ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి తనకు మీరు ఏ సాయం చేయాల్సిన అవసరం లేదు.. వివాహం చేసుకోవడానికి ఒక అమ్మాయిని వెతికి పెట్టండి చాలు అంటూ ఫోన్లో వేడుకున్నారు. కన్నాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయ్ సింగ్ రాజ్ పుత్ కు ఒక యువ రైతుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెళ్లి చేసుకోవడానికి తనకు ఒక అమ్మాయిని వెతికి పెట్టాల్సిందిగా సదరు యువరైతు విజ్ఞప్తి చేయగా, ఎమ్మెల్యే కూడా అతని పరిస్థితిని అర్థం చేసుకొని చాలా సానుకూలంగా స్వీకరించారు. వెంటనే నీ బయోడేటా పంపించు అమ్మాయిని వెతికిపెట్టే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చారు. ఈ ఫోన్ సంభాషణ వైరల్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యే మీడియా ముందు కూడా స్పందించారు.
గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు పెళ్లిళ్లు కాకపోవడం అన్నది ఒక వాస్తవ పరిస్థితి అని వివరించారు. రెండు వేల మంది జనాభా ఉన్న ఒక గ్రామాన్ని తీసుకుంటే అక్కడ దాదాపు 150 మంది వయసుకు వచ్చిన అబ్బాయిలు పెళ్లిళ్లు కాకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
100 ఎకరాల భూస్వామి అయినా.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో స్థిరపడిన వారి వైపు అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు మొగ్గు చూపుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న యువకులకు వివాహం అనేది పెద్ద సమస్యగా మారిందని ఎమ్మెల్యే వివరించారు. తమకు పెళ్లి కావడం లేదు.. మీకు తెలిసి ఎక్కడైనా అమ్మాయి ఉంటే చూసి పెట్టండి అంటూ తనకు ఇదే తరహాలో చాలామంది ఫోన్లు చేసి విజ్ఞప్తి చేస్తూ ఉంటారని, తాను కూడా వారి బాధను అర్థం చేసుకొని తన చేతనైన మేర ప్రయత్నాలు చేస్తూ ఉంటానని ఎమ్మెల్యే వివరించారు.