మహారాష్ట్రలో గడప గడపకు షిండే ప్రభుత్వం..
సంక్షేమ పథకాలపై సీఎం ఏక్ నాథ్ షిండే సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వ్యక్తిగతంగా లేఖలు పంపుతామని చెప్పారు.
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఇంటిలో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వ పథకాలు ఎన్ని అందుతున్నాయి, ఆయా పథకాల ద్వారా వచ్చే లబ్ధి ఎంత అనేది వారికి ఓ బుక్ లెట్ రూపంలో అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడం, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం, పనిలో పనిగా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం.. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా నూతన సీఎం షిండే ఇదే మార్గంలో ముందుకు వెళ్లబోతున్నారు. కోట్ల మంది సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆయన ప్రత్యేకంగా లేఖలు రాస్తున్నారు.
సంక్షేమ పథకాలపై సీఎం ఏక్ నాథ్ షిండే సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారాయన, ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వారి పేరుతోనే వ్యక్తిగతంగా లేఖలు పంపుతామని చెప్పారు సీఎం షిండే. ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వంతో కనెక్ట్ అయ్యే ప్రయత్నంలో భాగంగా ఈ లేఖలు రాస్తున్నట్టు తెలిపారు. పథకాల ప్రయోజనాలు ఆయా లబ్ధిదారులకు చేరాయో లేదో క్రాస్ చెక్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. లేఖలో పేర్కొన్న ప్రయోజనాలను అందకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని, ఈ లేఖలు అందుకు కూడా ఉపయోగపడతాయని అంటున్నారు.
గతంలో విమర్శలు..
గతంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ పేరుతో చేపట్టిన కొన్ని కార్యక్రమాలు విమర్శలకు తావిచ్చాయి. 'ఎస్, ఐ యామ్ బెనిఫిషియరీ' పేరుతో ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఫడ్నవీస్. ప్రభుత్వం నుంచి చేకూరే లబ్ధిని, పార్టీకి పనికొచ్చేందుకు వినియోగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తాజాగా ఇప్పుడు షిండే కూడా ఇదే తరహా ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. గడప గడపకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలతో లెటర్లు రాస్తున్నారు. శివసేన రెబల్ అనే ఇమేజ్ నుంచి త్వరగా బయటపడి.. షిండే మార్కుని చూపెట్టాలనుకుంటున్నారు.