Telugu Global
National

మహారాష్ట్ర , కర్నాటక సరిహద్దుల్లో ఉద్రిక్తం... వాహనాలపై దాడులు

ఈ రోజు బెలగావిలో కర్నాటక రక్షణ వేదిక అనే సంస్థ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నిరసన కారులు మహారాష్ట్ర నెంబరు గల వాహనాలపై రాళ్ళతో దాడులకు దిగారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయినట్టు సమాచారం.

మహారాష్ట్ర , కర్నాటక సరిహద్దుల్లో ఉద్రిక్తం... వాహనాలపై దాడులు
X


కొంత కాలంగా మహారాష్ట్ర, కర్నాటక మధ్య సరిహద్దు వివాదాలు సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్నాటకకు చెందిన నిరసన కారులు మహారాష్ట్ర వాహనాలపై దాడులకు దిగారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న‌ పలు గ్రామాలు కర్నాటకకు చెందినివిగా చాలా కాలంగా కర్నాటక వాదిస్తోంది. ఈ మధ్య ఈ విషయంపై రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య కూడా వాదోపవాదాలు నడిచాయి. మరో వైపు కర్నాటకలో ఉన్న బెలగావి పట్టణం తమదని మహారాష్ట్ర వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు బెలగావిలో కర్నాటక రక్షణ వేదిక అనే సంస్థ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నిరసన కారులు మహారాష్ట్ర నెంబరు గల వాహనాలపై రాళ్ళతో దాడులకు దిగారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయినట్టు సమాచారం.

సంప్రదాయ కన్నడ/కర్ణాటక జెండాలు చేతుల్లో పట్టుకున్న‌ అనేక మంది నిరసనకారులు ట్రాఫిక్‌ను అడ్డుకోవడంతో అనేక గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పరిస్థితిని శాంతింపజేసేందుకు పోలీసులు మోహరించారు.అయినప్పటికీ వెనక్కి తగ్గని నిరసన కారులు పోలీసులతో ఘర్షణకు దిగి రోడ్డుపై పడుకున్నారు.

దీంతో ఈ రోజు బెలగావికి రావాల్సిన ఇద్దరు మహారాష్ట్ర మంత్రులు, చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్ లు తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు. వారిద్దరి పర్యటన శాంతిభద్రతలకు సవాలుగా మారుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారమే హెచ్చరించారు.

ఒక వారం క్రితం బెలగావిలోని ఒక కళాశాల ఫెస్ట్‌లో, కన్నడ జెండాను ఊపుతున్న విద్యార్థిపై కొంతమంది మరాఠీ విద్యార్థులు దాడి చేసినప్పటి నుంచి ఈ సరిహద్దు గొడవ‌లు తీవ్రమయ్యాయి. బెలగావి పట్టణం పై రెండు రాష్ట్రాలు పట్టుదలగా ఉన్నాయి. ప్రస్తుతం కర్నాటకలో ఉన్న ఆ పట్టణం తమదే అని మహారాష్ట్ర వాదిస్తోంది. 1960లలో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో ఈ మరాఠీ మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకకు తప్పుగా ఇచ్చారని మహారాష్ట్ర చెప్తున్నది. నిజానికి ఆ పట్టణంలో మరాఠీ, కన్నడ మాతృ భాష గల వాళ్ళు ఉన్నారు.

First Published:  6 Dec 2022 5:32 PM IST
Next Story