Telugu Global
National

మంత్రిపై ఇంక్ చ‌ల్లిన కేసు: ఉరుము ఉరిమి మంగళం మీదపడ్డట్టు...జర్నలిస్టు అరెస్ట్

అంబేద్కర్, జ్యోతిబా ఫూలే లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిపై సిరా వేసి నిరసన తెలిపినందుకు ఇద్దరు సమతా సైనిక్ దళ్‌కు కార్యకర్తలను, వంచిత్ బహుజన్ అఘాడి సభ్యుడిని పింప్రి చిచ్వాడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వార్త రిపోర్ట్ చేసినందుకు న్యూస్18 జర్నలిస్టు గోవింద్ వాకడే ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మంత్రిపై ఇంక్ చ‌ల్లిన కేసు: ఉరుము ఉరిమి మంగళం మీదపడ్డట్టు...జర్నలిస్టు అరెస్ట్
X

మహారాష్ట్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ పై కొందరు నిరసనకారులు సిరా విసిరిన నేపథ్యంలో మంత్రి ఆదేశంతో ఆ వార్తను రిపోర్ట్ చేసిన జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు.

అంబేద్కర్, జ్యోతిబా ఫూలే లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిపై సిరా వేసి నిరసన తెలిపినందుకు ఇద్దరు సమతా సైనిక్ దళ్‌కు కార్యకర్తలను, వంచిత్ బహుజన్ అఘాడి సభ్యుడిని పింప్రి చిచ్వాడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వార్త రిపోర్ట్ చేసినందుకు న్యూస్18 జర్నలిస్టు గోవింద్ వాకడే ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

తనపై దాడి ప్రణాళికాబద్ధంగా జరిగిందని , అందులో జర్నలిస్టు పాత్ర కూడా ఉందని మంత్రి పాటిల్ ఆరోపించారు.

సిరా విసిరినప్పుడు, ఆ ఘటనను అంత ఖచ్చితంగా ఎలా రికార్డు చేయగలిగారు? అని పాటిల్ ప్రశ్నించారు.

"నాపై సిరా విసిరినప్పుడు ఆ జర్నలిస్ట్ అంత‌ ఖచ్చితమైన కోణంలో ఎలా రికార్డ్ చేయగలిగారు? ఆ జర్నలిస్టు ఎవరు? రేపు ఉదయానికి, ఈ జర్నలిస్ట్ జాడ తెలియకపోతే, నేను పింప్రి పోలీస్ స్టేషన్‌లో నిరాహార దీక్షకు కూర్చుంటాను," అని పాటిల్ చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ మహారాష్ట్రలో కొన్ని చోట్ల నిరసనలు చేపట్టింది.

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు పింప్రి చిచ్వాడ్ పోలీసులు ఆదివారం సాయంత్రం తెలిపారు, కమిషనర్ అంకుష్ షిండే టెలివిజన్ జర్నలిస్టు పాత్రపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

"జర్నలిస్టును పోలీసు స్టేషన్‌కు పిలిపించి, ఆదివారం అర్థరాత్రి ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. తదుపరి విచారణ కోసం సోమవారం మళ్లీ సమన్లు పంపుతాం' అని షిండే తెలిపారు.

జర్నలిస్టు అరెస్టు పై ముంబయి ప్రెస్‌క్లబ్‌ ఒక ప్రకటనను విడుదల చేసింది, జర్నలిస్టు ను అరెస్టు చేయడానికి మంత్రి చేపట్టిన చర్యలను ఖండిస్తూ వాకడే "కేవలం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు" అని పేర్కొంది.

పింప్రి-చించ్‌వాడ్ పత్ర‌కర్ సంఘ్ కూడా జర్నలిస్టు వాకడే అరెస్టును తీవ్రంగా ఖండించింది. వాకడేపై చర్య తీసుకోవాల్సిందిగా పోలీసులకు మంత్రి స్పష్టంగా సూచించడాన్ని తప్పుబట్టింది.

సంఘటనను రిపోర్ట్ చేసినందుకే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం ప్రారంభమైతే దేశంలో జర్నలిస్టులందరూ జైళ్ళలో ఉండాల్సిన పరిస్థితే అని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టు తన విధి నిర్వహణ చేసినందుకు అతనిపై కేసు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

First Published:  12 Dec 2022 1:48 PM IST
Next Story