షారుఖ్ ఖాన్‌కు Y+ సెక్యూరిటీ.. ఎందుకంటే.?
ముంబైలోని ఆయన నివాసం మన్నత్‌కు బెదిరింపు లేఖలు కూడా వచ్చాయి. దీంతో షారూఖ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు.
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంచింది. షారూఖ్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ సినిమాల తర్వాత షారూఖ్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ముంబైలోని ఆయన నివాసం మన్నత్‌కు బెదిరింపు లేఖలు కూడా వచ్చాయి. దీంతో షారూఖ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు.
బెదిరింపు కాల్స్, లేఖలు వస్తున్న దృష్ట్యా తనకు సెక్యూరిటీ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం షారూఖ్ సెక్యూరిటీని Y ప్లస్ కేటగిరీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వై ప్లస్ సెక్యూరిటీ కింద ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది 24 గంటల పాటు ఉంటారు. అంతకుముందు షారూఖ్‌కు ఇద్దరు సెక్యూరిటీ ఉండేవారు.
బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల కారణంగా మరో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సైతం Y ప్లస్ సెక్యూరిటీ కలిగి ఉన్నారు. ఇక షారూఖ్ ఖాన్ గతంలోనూ ముంబై అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులను ఎదుర్కొన్నారు. నిబంధనల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం.. ప్రాణాలకు ముప్పు ఉన్న పౌరులకు సెక్యూరిటీ ఇస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తులు సెక్యూరిటీ కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.