ముందు అనర్హత సంగతి తేల్చండి.. సుప్రీంని ఆశ్రయించిన ఉద్ధవ్..
ఈసీ రాజ్యాంగ కమిటీ దీనిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే థాక్రే వర్గం మరోసారి సుప్రీం మెట్లెక్కింది.
సీఎం కుర్చీ ఎలాగూ పోయింది. ఇప్పుడు శివసేనపై పెత్తనం కూడా పోతే అది మరింత అవమానకరం అని భావిస్తున్నారు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే. అందుకే ఈసీ నిర్ణయంపై ఆయన సుప్రీంని ఆశ్రయించారు. శివసేన పార్టీ నాయకత్వ హక్కులపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆపాలని ఉద్ధవ్ వర్గం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణలో ఉందని అది తేలే వరకు పార్టీపై నిర్ణయం తీసుకోవడం కుదరదని ఉద్ధవ్ వర్గం వాదిస్తోంది.
ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు..?
అసలైన శివసేన మాదేనంటోంది ఉద్ధవ్ థాక్రే వర్గం, కాదు సిసలైన శివసైన మాదేనంటున్నారు ఏక్ నాథ్ షిండే. తనకు 40మంది ఎమ్మెల్యేలు 12మంది ఎంపీల బలం ఉందని అంటున్నారు. అసెంబ్లీ బలపరీక్షలో ఇరు వర్గాలు ఎవరికి వారే విప్ జారీ చేసుకున్నారు. ఈ విషయంలో విప్ ధిక్కరించినవారిపై అనర్హత వేటు వేయాలని ఈసీని, సుప్రీంని కూడా ఆశ్రయించాయి రెండు వర్గాలు. ఈ పంచాయితీలో ఇటీవలే ఈసీ ఓ అప్డేట్ ఇచ్చింది. పార్టీలో తమ మెజార్టీని నిరూపించుకునేందుకు అవసరమైన లిఖితపూర్వక పత్రాలను ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది ఎన్నికల కమిషన్. పార్టీలో విభేదాలపై కూడా పూర్తి వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత ఈసీ రాజ్యాంగ కమిటీ దీనిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే థాక్రే వర్గం మరోసారి సుప్రీం మెట్లెక్కింది.
విల్లు-బాణం ఎవరికో..?
ప్రస్తుతానికి విల్లు-బాణం గుర్తుకోసం ఇరు వర్గాలు పోటీ పడుతున్నాయి. శివసేనపై పెత్తనం కోల్పోతే ఉద్ధవ్ థాక్రేకి రాజకీయ భవిష్యత్తు ఇబ్బందిగా మారుతుంది. షిండే వర్గానికి పార్టీ రాకపోయినా ప్రస్తుతం సీఎం పదవి వచ్చింది కాబట్టి అధికారం ఉన్నన్ని రోజులు ఇబ్బంది లేదు, ఆ తర్వాత బీజేపీలో చేరాలా.. లేక శివసేన బాల్ థాక్రే శిష్య వర్గం అనే కొత్త పార్టీ పెట్టాలా అనేది ఆలోచించుకోవచ్చు. కానీ ఉద్ధవ్ కి మాత్రం పార్టీ అత్యవసరం. అందుకే ఆయన సుప్రీం మెట్లెక్కారు. శివసేన పార్టీ, శివసేన గుర్తు తమకే కావాలంటున్నారు.