ఖాకీలూ... ఆ విషయంలో కంట్రోల్‌లో ఉండండి..
ఖాకీ యూనిఫామ్‌కు ఒక విలువ ఉందని, పెళ్లి వేడుకలు, పండుగలు, పబ్బాలు, ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో నృత్యం చేస్తూ దాని విలువ దిగజార్చవద్దని హెచ్చరించారు డీజీపీ.
పోలీసులు కూడా మనుషులే, వారికి కూడా భావోద్వేగాలు ఉంటాయి. మంచి పాట వినపడితే హమ్ చేయాలనిపిస్తుంది, మ్యూజిక్ వస్తే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. డీజే హోరులో అందరూ హుషారుగా చిందేస్తుంటే, ఖాకీలు మాత్రం నిగ్రహంతో నిలబడతారనుకోవడం పొరపాటే. పుణెలో ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనోత్సవంలో పోలీసులు కూడా డీజేకి స్టెప్పులేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడ్డారు. ఖాకీలు డ్యూటీ పక్కనపెట్టి ఇలా డ్యాన్స్ లు చేస్తే ఇక శాంతి భద్రతల్ని ఎవరు పట్టించుకోవాలంటూ ప్రశ్నించారు. దీంతో మహారాష్ట్ర డీజీపీ స్పందించారు. పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకెప్పుడూ యూనిఫామ్‌లో అలా డ్యాన్స్ లు చేయొద్దని హెచ్చరించారు.
సహజంగా ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే పోలీసులని కూడా గుంపులోకి లాగి డ్యాన్స్ చేయాలని కొంతమంది బలవంత పెడుతుంటారు. వారితో ఉన్న చనువు, వారిపై ఉన్న గౌరవంతో అలా చేస్తారనుకోవచ్చు. ఆ సమయంలో ఏమాత్రం సిబ్బంది స్పీడయినా కెమెరాలకు చిక్కడం సహజం. పోలీసుల డ్యాన్సుల్ని సరదాగా తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు, ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఏంటా పని అంటూ ఎవరైనా కామెంట్ పెడితే చాలు, ఇక చర్చ పెద్దదైపోతుంది. తప్పు పోలీసులదేననే నిందపడుతుంది. ఆ నింద వేయించుకోవడం ఎందుకు అని మందలిస్తున్నారు మహారాష్ట్ర డీజీపీ రజనీష్ సాఠే. పోలీసులు యూనిఫామ్‌లో ఉండగా ఊరేగింపుల్లో, శుభకార్యాల్లో ఎలాంటి నృత్యాలు చేయకూడదని ఆదేశాలిచ్చారు. ఖాకీ యూనిఫామ్‌కు ఒక విలువ ఉందని, పెళ్లి వేడుకలు, పండుగలు, పబ్బాలు, ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో నృత్యం చేస్తూ దాని విలువ దిగజార్చవద్దని హెచ్చరించారు.
డ్యాన్స్ చేయాలనిపిస్తే ఇలా చేయండి..
పోలీసుల్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనద్దు అని ఎవరూ కట్టడి చేయడంలేదని, అదే సమయంలో యూనిఫామ్ వేసుకుని సరదా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని మాత్రమే చెబుతున్నామని అన్నారు డీజీపీ సాఠే. సివిల్ డ్రస్సుల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన వచ్చని సూచించారు. యూనిఫామ్‌లో ఉన్నప్పుడు మాత్రం కాస్త నిగ్రహంతో ఉండాలని సూచించారు. కొంతమంది కావాలని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, దీనివల్ల యువతకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టవుతుందని చెప్పారాయన.