Telugu Global
National

నీ గుట్టు నాకు తెలుసు ఉద్ధవ్.. షిండే సీరియస్ వార్నింగ్..

టాపిక్ తనవైపు డైవర్ట్ కావడంతో ఆయన నేరుగా ఉద్ధవ్ పై విరుచుకుపడ్డారు. తాను మాట్లాడటం మొదలు పెడితే భూకంపం వస్తుందని అన్నారు షిండే.

నీ గుట్టు నాకు తెలుసు ఉద్ధవ్.. షిండే సీరియస్ వార్నింగ్..
X

శివసేనలో చీలిక తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఉక్రోషంతో రగిలిపోయినా.. సీఎం పదవి చేపట్టిన షిండే మాత్రం ఆయనపై పెద్దగా విమర్శలు ఎక్కు పెట్టలేదు. అసలైన శివసేన తనదేనంటూ ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన షిండే.. ఇప్పుడు పెద్ద బాంబు పేల్చారు. నేరుగా ఉద్ధవ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన రగడ దీనికి కారణమైంది.

గుజరాతీలు, రాజస్థానీలు లేకపోతే మహారాష్ట్రలో డబ్బులుండేవి కావని గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగగా.. సీఎం ఏక్ నాథ్ షిండే వాటిని ఖండించారు. అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని అన్నారు. ముంబైకి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకునే గుణం మహారాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ, పరోక్షంగా షిండేపై కూడా విమర్శలు గుప్పించారు ఉద్ధవ్ ఠాక్రే. దీంతో షిండేకి మండింది. టాపిక్ తనవైపు డైవర్ట్ కావడంతో ఆయన నేరుగా ఉద్ధవ్ పై విరుచుకుపడ్డారు. తాను మాట్లాడటం మొదలు పెడితే భూకంపం వస్తుందని అన్నారు షిండే.

ఆ నాయకుడి మరణం.. అసలు గుట్టు విప్పనా..?

అయితే విమర్శల మధ్యలో దివంగత నాయకుడు ఆనంద్ డిఘే పేరు తేవడం కాస్త కలకలం రేపుతోంది. ఆనంద్ డిఘే 2002లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన షిండేకి గురువు. అప్పట్లో ఆయన యాక్సిడెంట్ పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ ఘటనను ఇప్పుడు షిండే ప్రస్తావించారు. ఆరోజు ఏం జరిగిందో తనకు తెలుసని, దానికి ప్రత్యక్ష సాక్షి తానేనన్నారు షిండే. తాను నోరు తెరిస్తే భూకంపమేనన్నారు. ఇంతకీ ఆనంద్ డిఘే మరణానికి, షిండే భూకంపం మాటలకు సంబంధం ఏంటి..? ఉద్ధవ్ కి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..? ఈ ప్రశ్నలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గవర్నర్ వ్యాఖ్యల కంటే షిండే వ్యాఖ్యలే ఎక్కువ కలకలం రేపుతున్నాయి.

నమ్మకద్రోహి ఉద్ధవ్..

శివసేన చీలక వర్గాన్ని నమ్మక ద్రోహులుగా పేర్కొంటున్నారు ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఎన్నికలకు ముందు బీజేపీతో కలసి ప్రచారంలో పాల్గొని, ఎన్నికల తర్వాత కేవలం సీఎం సీటు కోసం కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపిన ఉద్ధవ్.. అందరికంటే పెద్ద నమ్మక ద్రోహి అని విమర్శిస్తున్నారు సీఎం షిండే. కేవ‌లం సీఎం కావ‌డానికి బాలా సాహెబ్ సిద్ధాంతాల‌ను ఉద్ధవ్ తుంగలో తొక్కారని మండిపడ్డారు.

First Published:  31 July 2022 3:30 AM GMT
Next Story