Telugu Global
National

ఏక్ నాథ్ కి ఎప్పుడైనా ముప్పే..

ఫడ్నవీస్ కి సీఎం పదవి దక్కనందుకు తామంతా సంతోషంగా లేమని, కానీ అధిష్టానం నిర్ణయాన్ని అంగీకరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఏక్ నాథ్ కి ఎప్పుడైనా ముప్పే..
X

ఏక్ నాథ్ షిండేకి పెద్ద మనసుతో తాము సీఎం పదవి ఇచ్చాం. వాస్తవానికి అది మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి దక్కాల్సిన పదవి అని సెలవిచ్చారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్. ఏక్ నాథ్ షిండేకి ఎప్పటికైనా బీజేపీతో ముప్పు ఉందని పరోక్షంగా హింటిచ్చారాయన. ఫడ్నవీస్ కి సీఎం పదవి దక్కనందుకు తామంతా సంతోషంగా లేమని, కానీ అధిష్టానం నిర్ణయాన్ని అంగీకరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

అసలేం జరిగింది..?

శివసేన నుంచి 40మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చిన ఏక్ నాథ్ షిండేతో బీజేపీ అధిష్టానం టచ్ లోకి వెళ్లింది. తనకు సీఎం పదవి వద్దని, తాను ప్రభుత్వంలో ఉండబోనని ముందుగానే దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఆయన్ను డిప్యూటీ సీఎంగా అమిత్ షా ప్రకటించారు. ఆ తర్వాత ఏక్ నాథ్ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే శివసేన రెబల్ ఎమ్మెల్యేల క్యాంప్ లు ఏర్పాటయ్యాయి. వారికి పూర్తి రక్షణ కల్పించడంతోపాటు, భవిష్యత్తుపై భరోసా ఇస్తూ బీజేపీ మంత్రాంగం నడిపింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే బీజేపీ నాయకుల మనసులో ఏక్ నాథ్ షిండేకు సీఎం పదవి ఇవ్వాలనే ఉద్దేశం లేదని ఇప్పుడు బయటపడింది.

గతిలేకే ఇచ్చారు కానీ..

ఏక్ నాథ్ షిండే అధికారం కోసమే శివసేన నుంచి బయటకొచ్చారు. థాక్రే కుటుంబ సభ్యులు సీఎం కుర్చీ ఆశించబోరని, కూటమికి తానే బాస్ అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుకున్నారాయన. కానీ అది సాధ్యం కాలేదు, ఉద్ధవ్ థాక్రే సీఎం కుర్చీలో కూర్చున్నారు. అప్పటినుంచి ఏక్ నాథ్ రగిలిపోయారు. బీజేపీతో మంతనాలు సాగించారు, చివరకు 40మంది ఎమ్మెల్యేలను బయటకు తెచ్చారు. సీఎం కుర్చీ రాదు అని అనుకుంటే ఏక్ నాథ్ షిండే శివసేనలోనే నెంబర్-2 లీడర్ గా కొనసాగేవారు. ముఖ్యమంత్రి పీఠం కోసమే ఆయన బయటకొచ్చారు, ఆ ఒప్పందం ప్రకారమే బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

బీజేపీకి కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయం లేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో అత్యథిక సీట్లు ఉన్న పార్టీగా అవతరించినా బీజేపీకి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ సీఎం సీటు కోసం దేవేంద్ర ఫడ్నవీస్ మొండికేస్తే ఎన్నికలు జరగడం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఈలోగా శివసేన రెబల్స్ మనసు మారితే మరింత కష్టం. అందుకే విధిలేని పరిస్థితుల్లో ఏక్ నాథ్ షిండేకు సీఎం కుర్చీ అప్పగించింది బీజేపీ. అయితే ఆ కుర్చీకిందకు నీళ్లు తెచ్చేందుకు కమలదళం వెనకాడబోదని చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. ఉదారంగా సీఎం సీటు తాము దానం చేశామని, అది అయిష్టంగానే ఇచ్చిన సీటు అని అంటున్నారాయన. ముందు ముందు ఏక్ నాథ్ ని, మహారాష్ట్ర బీజేపీ మరింత చులకన చేసి మాట్లాడినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు.

First Published:  24 July 2022 11:42 AM IST
Next Story