Telugu Global
National

ఆ 865 గ్రామాలు మావే.. మహారాష్ట్ర తీర్మానం

ఇటీవల కర్నాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు తమవేనంటూ తీర్మానం చేయడంతో మహారాష్ట్ర అసెంబ్లీ పోటీగా తీర్మానం చేసింది, ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకుంది.

ఆ 865 గ్రామాలు మావే.. మహారాష్ట్ర తీర్మానం
X

ఇటీవల కర్నాటక అసెంబ్లీ తీర్మానం చేసినట్టే, మహారాష్ట్ర అసెంబ్లీ కూడా పోటా పోటీగా తీర్మానం చేసింది. ప్రస్తుతం కర్నాటకలో ఉన్న 865 సరిహద్దు గ్రామాలు తమవేనని తేల్చేసింది. ఆ 865 గ్రామాల్లో మరాఠీ మాట్లాడతారని, అందుకే ఆ గ్రామాలు తమవేనంటోంది మహారాష్ట్ర. ఈమేరకు సీఎం ఏక్ నాథ్ షిండే ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. పొరుగు రాష్ట్రం కర్నాటక తీర్మానాన్ని ఆమోదించుకోగా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ ఎందుకు వెనకాడుతున్నారంటూ ఇటీవల మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన విమర్శల అనంతరం అధికార షిండే సేన, బీజేపీ కలసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తీర్మానానికి ప్రతిపక్షాలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి.

865 గ్రామాల్లోని ప్రతి అంగుళమూ మహారాష్ట్రదేనంటున్నారు నేతలు. దీనికి కావాల్సిన ఆధారాలన్నిటినీ సుప్రీంకోర్టుకి సమర్పిస్తామని ఆ గ్రామాలను చేజారబోనివ్వమని అంటున్నారు. బెల్గామ్‌, క‌ర్వార్‌, బీద‌ర్‌, నిపాని, భ‌ల్కి ప్ర‌దేశాల్లో ఉన్న 865 గ్రామాల‌ను తీర్మానం ద్వారా మహారాష్ట్రలో కలిపేస్తున్నామని ప్రకటించారు.

తీర్మానాలతో ఏమవుతుంది.. ?

కర్నాటకలో ఉన్న బెలగావి మాదేనంటుంది మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్న షోలాపూర్ తమదేనంటుంది కర్నాటక. మహారాష్ట్ర తీర్మానం చేసినంత మాత్రాన ఆ 865 గ్రామాలను ఆ రాష్ట్రంలో కలిపేస్తారని అనుకోలేం. కేసు సుప్రీంకోర్టులో ఉంది. సరిహద్దు వివాదం ఏళ్లతరబడి కొనసాగుతోంది. అయితే ఇటీవల కర్నాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు తమవేనంటూ తీర్మానం చేయడంతో మహారాష్ట్ర పోటీగా తీర్మానం చేసింది, ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకుంది. విచిత్రం ఏంటంటే రెండు రాష్ట్రాలు సరిహద్దు గ్రామాల అభివృద్ధిని పట్టించుకోవు. అక్కడ సరైన మౌలిక వసతులు లేవు. ప్రాంతాలపై ఉన్న ప్రేమ, ప్రజలపై లేకపోవడం విచిత్రం.

First Published:  27 Dec 2022 7:18 PM IST
Next Story