రైతుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదుగా .. మహారాష్ట్ర మంత్రి వింత సమాధానం
జిల్లాలో ఇటీవల కాలంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అందుకు మంత్రి స్పందించారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడం కొత్తేమీ కాదని, కొన్నేళ్లుగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
అతివృష్టి, అనావృష్టి, ధరలు లేకపోవడం, దళారుల దోపిడీ ఇలా రకరకాల కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన పాలకులు దాన్ని కూడా లైట్ తీసుకోవడం షాక్ కలిగిస్తోంది. పంట నష్టాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. దీనిపై మీ సమాధానం ఏంటి? అని మీడియా ప్రతినిధులు మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని ప్రశ్నించగా.. దానిపై ఆయన ఎంతో తేలిగ్గా స్పందించారు. అందులో కొత్త ఏం ఉందని రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం మామూలే కదా.. ఇలాంటి సంఘటనలు కొన్నేళ్లుగా జరుగుతున్నాయి.. అని సమాధానం ఇవ్వడంతో మీడియా ప్రతినిధులు బిత్తర పోయారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఇటీవల ఆరుగురు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని సిలోద్ నియోజకవర్గంలో గడిచిన తొమ్మిది రోజుల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది.
ఇదిలా ఉండగా.. గతవారం ఔరంగాబాద్ జిల్లాలో అకాల వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా పలు పంటలకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు తాజాగా మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ ఔరంగాబాద్ జిల్లాలోని సిలోద్ నియోజకవర్గంలో పర్యటించారు. పంట నష్టంపై అధికారుల కమిటీ అందజేసిన నివేదికను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల కాలంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అందుకు మంత్రి స్పందించారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడం కొత్తేమీ కాదని, కొన్నేళ్లుగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే తన నియోజకవర్గంతో పాటు, మొత్తం మహారాష్ట్రలో ఎక్కడా రైతుల ఆత్మహత్యలు జరగకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు.
రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. రైతుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ఒక్క రూపాయికే పంటల బీమా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కొత్త కాదని వ్యవసాయ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. చేతనైతే రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలని, అలాకాకుండా రైతుల ఆత్మహత్యల్లో కొత్త ఏం ఉందని మంత్రి వ్యాఖ్యానించడంపై విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.