Telugu Global
National

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కథ ఏంటి...

మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీలాండరింగ్ కూడా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దీనిపై దృష్టి సారించి విచారణ జరుపుతోంది. బెట్టింగ్ యాప్‌తో సంబంధం ఉన్నవాళ్ళకి, దీని కోసం ప్రమోట్ చేసినవాళ్ళకి ఈడీ నోటీసులు పంపుతోంది.

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కథ ఏంటి...
X

బాలీవుడ్‌లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 39 ప్రాంతాల్లో దాడులు చేసి సుమారు రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకుంది. ఈడీ విచారణ పరిధిలో పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వాధికారులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, మీడియాకు చెందినవారితో పాటు పలు రంగాలవారు ఉన్నారు.


మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనేది సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌ అనే ఇద్దరు ప్రమోటర్లు నిర్వహించే ఒక గేమింగ్, ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్. ఒకప్పుడు ఈ యాప్‌కి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు భారీగా డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేశారు. అయితే ఈ యాప్ అధినేతల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్ ఇటీవల తన వివాహాన్ని దుబాయ్‌లో రూ.200 కోట్లతో ఘనంగా చేసుకున్నాడు. నాగపూర్ నుంచి కుటుంబ సభ్యులను యూఏఈకి తీసుకువెళ్ళడానికి ప్రైవేటు జెట్లు వినియోగించారు. టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, భారతి సింగ్, కృతి కర్బందా, నుశ్రుత్.. ఇలా అనేక మంది బాలీవుడ్ స్టార్‌లను చార్టెడ్ ఫ్లైట్స్ లో పెళ్లికి రప్పించుకున్నారు. డాన్సర్లను, పెళ్ళి మండపాన్ని అలంకరించేవారిని ముంబయి నుంచి తీసుకెళ్లారు. ఈ సంఘటన తర్వాత మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీలాండరింగ్ కూడా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దీనిపై దృష్టి సారించి విచారణ జరుపుతోంది. బెట్టింగ్ యాప్‌తో సంబంధం ఉన్నవాళ్ళకి, దీని కోసం ప్రమోట్ చేసినవాళ్ళకి ఈడీ నోటీసులు పంపుతోంది.


అసలు వీరి ప్లాన్ ఏంటి అంటే...

వీరు కొత్త కొత్త వెబ్‌సైట్లు, చాటింగ్‌ యాప్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తారు. తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్‌లో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడకుండా వాట్సాప్‌ ద్వారానే సంప్రదిస్తుంటారు. వారిని జాగ్రత్తగా బెట్టింగ్‌ యాప్‌లో సభ్యులుగా చేర్చి, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్‌ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌లు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్‌ నిర్వాహకుల బినామీ ఖాతాల్లోకి చేరుతుంది. యాప్‌లో బెట్టింగ్‌లు కాస్తే మొదట లాభాలు వచ్చినట్టు నమ్మిస్తారు. దాంతో కస్టమర్‌లో ఆశ పెరిగిపోతుంది. ఇంకా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్‌ యాప్‌లో రిగ్గింగ్‌ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది.


ఇప్పుడు విషయాలన్నీ బయటపడి అరెస్టులు జరుగుతుండటంతో సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్ కుటుంబ సభ్యులు మెల్లగా భారత్ నుంచి దుబాయ్‌కు జారుకున్నారు.


First Published:  7 Oct 2023 6:06 AM GMT
Next Story