'మహా' నిరీక్షణకు డిసెంబర్ 5న తెర
కొలువుదీరనున్న మహాయుతి సర్కారు.. సీఎం ఎవరెనేది ఇంకా సస్పెన్సే!
మహా నిరీక్షణకు డిసెంబర్ 5న తెరపడే అవకాశముందని తెలుస్తోంది. అదే రోజు మహారాష్ట్రలో మహాయుతి కూటమి సర్కారు కొలువుదీరే అవకాశాలున్నాయని చెప్తున్నారు. మహా ముఖ్యమంత్రి రేసులో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో ఉన్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ వీడటం లేదు. ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యత ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకుంటారని ఏక్‌నాథ్ షిండే చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తననే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి బీజేపీ ఇప్పుడు ఫడ్నవీస్ ను తెరపైకి తేవడంపై షిండే అసంతృప్తితో ఉన్నారు. ఎన్‌సీపీ కూడా ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతుండటంతో షిండే ప్రస్తుతానికి వేచిచూసే ధోరణి అనుసరిస్తున్నారు. తమకు ఇచ్చిన హామీ మేరకు షిండేనే సీఎం చేయాలని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మహా పంచాయితీ అలాగే ఉండిపోయింది. బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్‌నే సీఎం చేయాలని పట్టుదలతో ఉన్నా, ఆచితూచి అడుగులు వేస్తోంది. ఫడ్నవీస్ కు మరాఠాల మద్దతు లేకపోవడం, ఆయనపై ఓబీసీల్లోనూ వ్యతిరేకత ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరాఠాలు, ఓబీసీల మద్దతున్న షిండేనే సీఎం చేయాలని ఆయా వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంపికపై సాగదీత ధోరణిని బీజేపీ అధినాయకత్వం అనుసరిస్తోంది.
288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మహాయుతి కూటమి 230 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ నుంచి 132 మంది, శివసేన నుంచి 57 మంది, ఎన్‌సీపీ నుంచి 41 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒకవేళ ఫడ్నవీస్ విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకుంటే మురళీధర్, వినోద్ తావ్డే, రాధాకృష్ణ విఖే పాటిల్ పేర్లు పరిశీలిస్తున్నట్టు లీకులు ఇస్తున్నారు. మహాయుతి శాసనసభ పక్షనేతను ఎన్నకునేందుకు కూటమి పార్టీలు డిసెంబర్ 2న ముంబయిలో సమావేశం కానున్నారు. ఆలోగా సంప్రదింపుల ప్రక్రియను బీజేపీ కేంద్ర నాయకత్వం పూర్తి చేస్తుందని చెప్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంలు, కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ముంబయిలోని ఆజాద్ మైదానంలో చేస్తారని కూటమి నేతలు చెప్తున్నారు. మహారాష్ట్రలో భారీ విజయం సాధించిన నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం, మంత్రివర్గ ప్రమాణ స్వీకరానానికి ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ లకు బీజేపీ హైకమాండా అన్న ప్రశ్నలు మరాఠా నేతలు లేవనెత్తుతున్నారు. స్థానిక పార్టీలు కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల కోసం సాగిల పడటంపై మండిపడుతున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ ఫడ్నవీస్ నే సీఎం చేస్తుందని తేల్చిచెప్తున్నారు. అంతమాత్రానికి మరాఠాల ఆత్మగౌరవాన్ని బీజేపీ పెద్దల వద్ద తాకట్టు పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.