హేమమాలిని డ్యాన్స్ చేసే స్థాయిలో అభివృద్ధి చేశా.. మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
అభివృద్ధి గురించి వివరించే ప్రయత్నంలో మంత్రి నరోత్తం మిశ్రా హేమమాలిని పేరు ప్రస్తావనకు తీసుకురావడం దుమారం రేపింది. మిశ్రా వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాతియాలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఆయన బీజేపీ ఎంపీ హేమమాలిని పేరును ప్రస్తావిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హోం మంత్రి నరోత్తం మిశ్రా దాతియాలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్ హయాంలో దాతియా నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు. దాతియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, హేమమాలిని కూడా డ్యాన్స్ చేసే స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు.
అభివృద్ధి గురించి వివరించే ప్రయత్నంలో మంత్రి నరోత్తం మిశ్రా హేమమాలిని పేరు ప్రస్తావనకు తీసుకురావడం దుమారం రేపింది. మిశ్రా వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఓ మహిళా నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు, అందునా తమ పార్టీకే చెందిన హేమమాలినిపై మిశ్రా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దారుణమని జేడీయూ మండిపడింది. ప్రతిపక్ష నాయకులనే కాదు అవసరమైతే సొంత పార్టీకి చెందిన మహిళా నేతలను కూడా బీజేపీ నాయకత్వం కించపరుస్తుందని ఆ పార్టీ నేతలు విమర్శించారు.
మిశ్రా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల బీజేపీ నేతల సంస్కారం ఇలా ఉందంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాగా, బాలీవుడ్‌కు చెందిన నటీనటులపై నరోత్తం మిశ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. కొంతకాలం కిందట నటి షబానా అజ్మీ, జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాలు స్లీపర్ సెల్స్ ఏజెంట్లని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమాను మధ్యప్రదేశ్‌లో విడుదల కాకుండా అడ్డుకుంటామని నరోత్తం మిశ్రా అప్పట్లో ప్రకటించి వార్తల్లో నిలిచారు.