ఆదిపురుష్ పై బీజేపీ నజర్.. దర్శకుడికి వార్నింగ్..
టీజర్లో ఉన్న విషయాలు బీజేపీ నేతలకు నచ్చలేదు. సెన్సార్ డిపార్ట్ మెంట్ కంటే ముందే వీరు టీజర్ ని స్కాన్ చేశారు. మార్పులు చేర్పులు చేయకపోతే మా ప్రతాపం చూపిస్తామంటూ నేరుగా దర్శకుడికే వార్నింగ్ ఇచ్చారు.
ఆది పురుష్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా నలుగుతోంది. బాగుందని కొందరు, బాలేదని కొందరు, అది కార్టూన్ సినిమా అని మరికొందరు.. రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. రాముడి సినిమా విషయంలో తమ మార్కు లేకపోతే బాగుండదని అనుకున్నారో ఏమో బీజేపీ నేతలు కూడా లైన్లోకి వచ్చారు. అసలు రాముడిని, సీతమ్మను అలా చూపిస్తారా అంటూ రెచ్చిపోయారు. వారి పాత్రలను మరింత పవిత్రంగా తీర్చిదిద్దాలను, అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయంటూ మండిపడ్డారు. దర్శకుడు ఔం రౌత్ కి లేఖ రాసిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. సినిమాలో అభ్యంతరకరమైన సీన్లను డిలీట్ చేయాలని, తిరిగి వాటిని చిత్రీకరించాలని డిమాండ్ చేశారు.
ఆది పురుష్ టీజర్ లో సీతాదేవి పాత్రధారి కృతి సనన్, ఊయల ఊగుతూ ఉంటుంది. ఆమె రాముడి పాత్ర ధరించిన ప్రభాస్ కి దగ్గరగా వచ్చే ఓ సన్నివేశం ఉంది. ఈ సీన్ సనాతన వాదులకు కోపం తెప్పించింది. ఇలాంటి సన్నివేశాలు సాధారణ సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ఉంటే బాగుంటుందని, రాముడు-సీత మధ్య ఈ సీన్లు ఉండటం సరికాదంటున్నారు. ఇక హనుమాన్ పాత్రలో ఉన్న వ్యక్తికి లెదర్ బెల్ట్ లాంటి వస్త్రధారణ ఉంటుంది. దీనిపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా. పురాణ పాత్రలు ఏవీ రామాయణ గ్రంథంలో చెప్పిన విధంగా లేవని, వాటి ఆహార్యం, వస్త్రధారణ అంతా కొత్తగా ఉందని అంటున్నారాయన. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఈ సన్నివేశాలున్నాయని చెప్పారు. ఆయా సీన్లను తొలగించకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇటీవల కాళీ అనే సినిమా పోస్టర్ పై కూడా నరోత్రమ్ మిశ్రా ఇలాగే ఘాటుగా స్పందించారు. తాజాగా ఆయన ఆదిపురుష్ ని టార్గెట్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాని బీజేపీ నేతలు ఓన్ చేసుకోవాలని చూశారు ప్రభాస్ ని ఇప్పటికే బీజేపీ దగ్గరకు తీస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ ని కూడా రామ్ లీలా మైదానంలో విడుదల చేయడం విశేషం. అయితే టీజర్లో ఉన్న విషయాలు మాత్రం బీజేపీ నేతలకు నచ్చలేదు. దీంతో సెన్సార్ డిపార్ట్ మెంట్ కంటే ముందే వీరు టీజర్ ని స్కాన్ చేశారు. మార్పులు చేర్పులు చేయకపోతే మా ప్రతాపం చూపిస్తామంటూ నేరుగా దర్శకుడికే వార్నింగ్ ఇచ్చారు. రాముడిపై సినిమా తీయాలంటే.. ముందుగా బీజేపీ నేతల దగ్గర నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు బీజేపీ నేతలు.