పదహారేళ్లకే శృంగారానికి సమ్మతి
ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో యువత తొందరపాటుతో వేసే ప్రతి అడుగూ భవిష్యత్తును అంధకారంగా మార్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.
అమ్మాయిలు సెక్స్‌లో పాల్గొనే వయసు (ఏజ్ ఆఫ్ కన్సెంట్)పై మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. బాలికలు తమ ఇష్టపూర్వకంగా 16ఏళ్ల వయసులో శృంగారంలో పాల్గొనవచ్చని అభిప్రాయపడింది. మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అమ్మాయిల శృంగార వయసును 18 సంవత్సరాల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సూచించింది. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో యువత తొందరపాటుతో వేసే ప్రతి అడుగూ భవిష్యత్తును అంధకారంగా మార్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.
యవ్వనంలోకి అడుగుపెట్టిన చాలా మంది యువకులు 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలతో సంబంధం కలిగి ఉంటారని కోర్టు గుర్తుచేసింది. ఈ విషయంలో తప్పు ఇద్దరిదీ ఉన్నప్పటికీ మైనర్ బాలికలపై అత్యాచారం అనే కోణంలో యువకులపై పోక్సో చట్టం, అత్యాచారం వంటి నేరాలను నమోదు చేస్తున్నారని కోర్టు తెలిపింది. యవ్వనంలో లైంగిక ఆకర్షణ కారణంగా జరిగే పొరపాట్లు వారిని నిందితుల్ని చేస్తున్నాయని అభిప్రాయపడింది. ఫలితంగా యువకుల జీవితాలు చీకటిమయవుతున్నాయని ఓ కేసులో తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.
గ్వాలియర్‌లోని తాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాహుల్ జాతవ్ అనే వ్యక్తిపై 14 ఏళ్ల బాలిక అత్యాచార కేసు నమోదు చేసింది. 2020 జూలై 17న పోలీసులు రాహుల్‌ని అరెస్ట్ చేశారు. నాటి నుంచి రాహుల్ జైలు జీవితం గడుపుతున్నాడు. కేసు వివరాల ప్రకారం.. 2020 జనవరి 18న బాధితురాలు కోచింగ్ కోసం రాహుల్ వద్దకు వెళ్లింది. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రాహుల్ మత్తు మందు కలిపిన జ్యూస్ ఆమెకు ఇచ్చాడు. బాధితురాలు స్పృహతప్పి పడిపోయిన తరువాత ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది.
కాగా.. ఇదే బాలిక మరో వ్యక్తిపైన గతంలో ఆరోపణలు చేసిందని రాహుల్ తరపు న్యాయవాది రాజమణి బన్సాల్ కోర్టుకు తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని దూరపు బంధువు మోసం చేశాడని ఆరోపించిందని, ఆ కేసులో ఇరువురి అంగీకారంతోనే వారి మధ్య లైంగిక సంబంధం ఏర్పడిందని రాహుల్ తరుపు న్యాయవాది చెప్పారు. వారిద్దరి మధ్యలో తన క్లయింట్ రాహుల్ చిక్కుకున్నాడని, అందువల్ల రాహుల్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్ట్ రాహుల్ జాతవ్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసింది. ఈ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
యుక్తవయస్సులో ఉన్న యువతీ యువకులు చిన్న వయసులో సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారని అభిప్రాయపడింది. అందువల్ల బాలికల శృంగార వయసును 16ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో సమీక్ష జరపాలని అభిప్రాయపడింది.