Telugu Global
National

స్మగ్లర్ తో బీజేపీ సీఎం సహపంక్తి భోజనం..

ఇటీవలే జైలునుంచి బయటకొచ్చిన స్మగ్లర్ నేరుగా సీఎం పక్కకు వెళ్లి కూర్చున్నాడంటే భద్రతా వైఫల్యంతోపాటు, అధికార పార్టీ నేతలతో అతనికి ఏ స్థాయిలో పరిచయాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

స్మగ్లర్ తో బీజేపీ సీఎం సహపంక్తి భోజనం..
X

రేపిస్ట్ లు జైలు నుంచి విడుదలైతే స్వాగతం పలకడం, పేపర్ లీకేజీ నిందితులు బెయిల్ పై బయటకొస్తే దండలేయడం.. ఇలాంటివన్నీ బీజేపీ నేతలకు అలవాటే. అయితే తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఏకంగా ఓ స్మగ్లర్ తో కలసి సహపంక్తి భోజనం చేశాడు. దొంగలు, దోపిడీదారులు, స్మగ్లర్లలో పరివర్తన కోసం ఈ కార్యక్రమం చేపట్టారని అనుకుంటే పొరపాటే. అనుకోకుండా ఆ నేరస్తుడు పోలీసుల కళ్లుగప్పి సీఎం పక్కన వచ్చి కూర్చున్నాడు. ఇక సామాన్యులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసినట్టు సీఎం అతడిపై చేయివేసి భుజం తట్టాడు. కలసి కూర్చుని భోజనం చేశాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి షాకయ్యాడు.

మధ్యప్రదేశ్ కి చెందిన అరవింద్ గుప్తా అనే వ్యక్తి ఇటీవల కలప స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. రిమాండ్ ఖైదీగా జైలులో ఉండి బయటకొచ్చాడు. సీధీ జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా బీజేపీ నేతలతో ఉన్న పరిచయాలను వాడుకుని అరవింద్ కూడా గుంపులో కలిసిపోయాడు. సీఎం సహపంక్తి భోజనంలో స్థానం దక్కించుకున్నాడు. స్థానిక నేతల చొరవతో అతడు ఏకంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేశారు. ఈ ఫొటోలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విషయం బయటపడింది. స్మగ్లింగ్ చేస్తూ జైలుకెళ్లొచ్చిన నిందితుడితో కలసి సీఎం భోజనం చేశారంటూ విమర్శలొచ్చాయి. దీంతో సీఎం షాకయ్యారు.

ఇటీవలే జైలునుంచి బయటకొచ్చిన స్మగ్లర్ నేరుగా సీఎం పక్కకు వెళ్లి కూర్చున్నాడంటే భద్రతా వైఫల్యంతోపాటు, అధికార పార్టీ నేతలతో అతనికి ఏ స్థాయిలో పరిచయాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ చొరవవతోనే నేరుగా సీఎం పక్కకు వెళ్లి కూర్చున్నాడు, దర్జాగా భోజనం చేశాడు. ఇలాంటి వాళ్లంతా ఆ ఫొటోలను అడ్డు పెట్టుకుని మరిన్ని నేరాలకు పాల్పడటం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. అయినా ఇదంతా బీజేపీ నేతలకు మామూలే అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. స్మగ్లర్ అని తేలిసే సీఎం చౌహాన్ తన పక్కన కూర్చునే అర్హత అతనికి ఉందని పిలిపించుకుని ఉంటారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

First Published:  19 April 2023 2:24 AM GMT
Next Story