Telugu Global
National

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల

ఈ ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ దశలో మూత్రవిసర్జన ఘటన ప్రభుత్వ ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసేలా కనిపించింది. దీంతో వెంటనే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు.

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల
X

మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు ఇటీవల ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే వెలుగు చూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘోరం జరిగింది. సిద్ధి జిల్లాలో దశరథ్ అనే ఓ గిరిజనుడిపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి, గిరిజన సంఘాలు కూడా ఆందోళనబాట పట్టాయి. దీంతో బీజేపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో జరిగిన పాపం. దీంతో పాప పరిహారం కోసం ప్రభుత్వం సిద్ధపడింది. ప్రవేశ్ శుక్లాపై కేసు పెట్టడంతోపాటు, అతడి ఇంటిపైకి బుల్డోజర్ ని పంపించారు. అక్కడితో ఆగలేదు. బాధితుడి కాళ్లు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.


ఈ ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ దశలో మూత్రవిసర్జన ఘటన ప్రభుత్వ ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసేలా కనిపించింది. దీంతో వెంటనే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు. సహజంగా ఎవరైనా బాధితుడిని కలసి ఓదార్పు ఇస్తారు. కానీ చౌహాన్ మరో అడుగు ముందుకేశారు. బాధితుడిని తన ఇంటికి తీసుకొచ్చారు. అతడికి క్షమాపణ చెప్పారు, కాళ్లు కడిగారు.

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, గిరిజన బాధితుడిని ఇంటికి తీసుకొచ్చారు. కుర్చీలో కూర్చోబెట్టి, పాదాలను పళ్లెంలో పెట్టి కడిగారు. ఆ నీటిని తలపై చల్లుకున్నారు. అతడికి కొత్త బట్టలు అందించారు. అతడిని సుధామ అని పిలిచారు సీఎం చౌహాన్. అతడిని చూసి తన మనసు చలించిపోయిందన్నారు. తనకు ప్రజలు దేవుడితో సమానం అని అన్నారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.

First Published:  6 July 2023 12:25 PM IST
Next Story