మధ్యప్రదేశ్ బీజేపీలో గోరంట్ల మాధవ్ ని మించిన నాయకుడు
ఆఫీస్ రెంట్ ఎగ్గొట్టిన మన గోరంట్ల కాస్త నయం, అక్కడ మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కనీసం టీ కొట్టు బాకీ కూడా తీర్చలేదు. టీ బాకీ ఎగ్గొట్టి తిరుగుతున్న ఆ ఎమ్మెల్యేని ఇటీవలే టీ కొట్టు యజమాని నిలదీయడంతో వ్యవహారం బయటపడింది.
ఇటీవల ఏపీ రాజకీయాల్లో మారుమోగిన పేరు గోరంట్ల మాధవ్. వీడియో కాల్ వ్యవహారం సద్దుమణిగిపోయిన తర్వాత, ఆయన ఆఫీస్ రెంట్ కూడా ఎగ్గొట్టారనే వార్త మరింత సంచలనంగా మారింది. ప్రభుత్వం నుంచి జీతంతోపాటు అలవెన్స్ లు కూడా తీసుకునే ఓ ఎంపీ, ఆఫీస్ రెంట్ ఎందుకు కట్టలేదు, ఏళ్లతరబడి అద్దె ఇవ్వకపోవడంతోపాటు యజమానిని బెదిరించడం ఏంటి అనే విషయాలు చర్చకు వచ్చాయి. తీరా పోలీస్ పంచాయితీలో ఏం జరిగిందో ఏమో ఆ వ్యవహారం మళ్లీ సద్దుమణిగింది. మన గోరంట్ల కాస్త నయం, అక్కడ మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కనీసం టీ కొట్టు బాకీ కూడా తీర్చలేదు. టీ బాకీ ఎగ్గొట్టి తిరుగుతున్న ఆ ఎమ్మెల్యేని ఇటీవలే యజమాని నిలదీయడంతో వ్యవహారం బయటపడింది. బీజేపీ ఎమ్మెల్యేని స్థానికులంతా చీదరించుకున్నారు.
మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లా ఇచావర్ ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యే కరణ్ సింగ్ వర్మ కారులో వెళ్తుండగా టీ కొట్టు యజమాని ఆయన కారుని ఆపారు. తన టీ బకాయి 30వేల రూపాయలు చెల్లించాలంటూ పట్టుబట్టారు. ఈ వ్యవహారాన్ని స్థానికుడొకరు సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే కరణ్ సింగ్ వర్మ బండారం బయటపడింది. 30వేలు టీ బిల్లు చెల్లించకుండా కరణ్ సింగ్ తప్పించుకు తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందని స్థానికులు నెగెటివ్ కామెంట్లు పెట్టారు. ఇంత కక్కుర్తి ఏంటని ట్రోల్ చేశారు.
మధ్యప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండే సరికి ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళ్తున్నారు. గెలిచాక నియోజకవర్గంవైపు చూడని కరణ్ సింగ్ కూడా తాజాగా పర్యటనలు మొదలు పెట్టారు. దీంతో కరణ్ సింగ్, టీ కొట్టు యజమానికి దొరికాడు. తన పాతబాకీ సంగతి ఏమైందని ఆయన ఎమ్మెల్యేని నిలదీశాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కరణ్ సింగ్ వర్మ టీ దుకాణం యజమానికి ఇప్పటివరకూ డబ్బులు చెల్లించలేదు. బాకీ నిజమేనని, త్వరలో తీర్చేస్తానంటూ సమాధానం చెప్పి అక్కడినుంచి జారుకున్నాడు ఎమ్మెల్యే వర్మ. ప్రభుత్వం నుంచి జీతం, అలవెన్స్ లు తీసుకునే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇంత కక్కుర్తిగా ఆలోచిస్తారా అంటూ జనం షాకయ్యారు.