కర్నాటక ఆర్టీసీలో ల్యాప్ టాప్‌కి లగేజ్ చార్జ్..
ల్యాప్ టాప్‌కి లగేజీ చార్జీ ఏంటని ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కండక్టర్‌ని నిలదీసినా ఫలితం లేదు. చార్జీ కట్టాల్సిందేనన్నారు, పది రూపాయలు వసూలు చేశారు.
కర్నాటక ఆర్టీసీ బస్సులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కి వింత అనుభవం ఎదురైంది. గడగ్ నుంచి హుబ్బళ్లి వెళ్తున్న అతను, బస్సులో ల్యాప్ టాప్ ఓపెన్ చేశాడు. ఇంతలో కండక్టర్ వచ్చి 10 రూపాయలు లగేజ్ టికెట్ కొట్టి చేతిలో పెట్టాడు. అదేంటని అడిగితే, ల్యాప్ టాప్ చార్జీ అన్నాడు. అతను షాకయ్యాడు. ఆ తర్వాత అసలు విషయం ఆరా తీస్తే.. ఇటీవల కర్నాటక ఆర్టీసీ లగేజ్ విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చిందని తెలిసింది. ఆ నిబంధనల్లో 30 కేజీల లోపు లగేజీకి చార్జీలు ఉండవని చెప్పింది. అయితే ఏయే వస్తువులు తీసుకెళ్తే లగేజీ చార్జీ ఉండదో కూడా వివరించింది. బియ్యం, రాగులు, కూరగాయలు, ఫ్యాన్, మిక్సీ, కొబ్బరికాయలు.. ఇలాంటివి 30కేజీల లోపు ఉంటే వాటికి లగేజీ చార్జీ ఉండదు. అయితే ఇందులో ల్యాప్ టాప్ లేదు. ఈ నిబంధన అడ్డు పెట్టుకుని కొంతమంది ల్యాప్ టాప్‌కి కూడా లగేజీ చార్జీలు వసూలు చేస్తున్నారు.
ల్యాప్ టాప్‌కి లగేజీ చార్జీ ఏంటని ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కండక్టర్‌ని నిలదీసినా ఫలితం లేదు. చార్జీ కట్టాల్సిందేనన్నారు, పది రూపాయలు వసూలు చేశారు. ఇదెక్కడి అన్యాయం అంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. 10 రూపాయలనేది చిన్న మొత్తమే అయినా ఇప్పుడు సెల్ ఫోన్, ల్యాప్ టాప్ అనేది సాధారణం అయిపోయిందని, తాము ఎక్కడికి వెళ్లినా తమ వెంట ల్యాప్ టాప్ ఉండాల్సిందేనంటున్నారు. ఇలా కొత్త కొత్త నిబంధనలతో తమని ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంటున్నారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.
అయితే ల్యాప్‌టాప్‌ల కోసం అదనపు ఛార్జీలు విధించే నిబంధన ఏదీ లేదని కర్నాటక ఆర్టీసీ అధికారులు వివరణ ఇస్తున్నారు. ప్యాసింజర్ లగేజీలో మొబైల్ ఫోన్ లాగే ల్యాప్ టాప్ కూడా ఒక భాగమని అందుకే దానికి చార్జీలు లేవని చెప్పారు. అయితే నిబంధనల్లో మాత్రం ల్యాప్ టాప్ పేరు లేకపోవడంతో కొంతమంది కండక్టర్లు అత్యుత్సాహంతో ఇలా లగేజీ చార్జీలు వసూలు చేస్తున్నట్టు తేలింది.