జైల్లో బర్త్ డే వేడుక జరుపుకున్న ఖైదీ.. తోటి ఖైదీలకు స్నాక్స్ పార్టీ
పలువురు ఖైదీలు హ్యాపీ బర్త్ డే మణి.. అని చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో జైలు అధికారులు అప్రమత్తం అయ్యారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా మూవీ చూశారా..? అందులో విలన్ ముఖేష్ రుషి జైల్లో ఉంటాడు. కానీ, అతడు అక్కడే తన అనుచరులతో కలిసి సెటిల్మెంట్లు చేస్తుంటాడు. బయటకెళ్ళి మర్డర్లు చేసి మళ్లీ జైల్లోకి వస్తుంటాడు. మనదేశంలో జైళ్ల వ్యవస్థపై దర్శకుడు త్రివిక్రమ్ వేసిన సెటైర్ ఇది. జైళ్లలో డబ్బుకు ఆశపడి అధికారులు ఖైదీలను ఏ విధంగా వదిలేస్తారో తాజాగా జరిగిన ఓ సంఘటన ఇందుకు అద్దం పడుతోంది.
పంజాబ్ రాష్ట్రం లూథియానాలో మణి రాణా అనే వ్యక్తి ఒక కేసులో రిమాండ్ నిమిత్తం స్థానిక జైల్లో ఉన్నాడు. అతడు జైల్లో ఉంటూనే తన బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా జరుపుకొన్నాడు. తోటి ఖైదీలకు పార్టీ కూడా ఇచ్చాడు. బయట నుంచి చాయ్, పకోడీ తెప్పించి ఖైదీలకు పంచిపెట్టాడు. మణి తానుండే బ్యారక్ లో 12 మంది ఖైదీలతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నాడు.
ఈ సందర్భంగా సెల్ ఫోన్ లో వీడియోలు కూడా తీసుకున్నారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో ఖైదీలు వరుసగా కూర్చొని చాయ్ తాగుతూ పకోడీ తింటూ ఎంజాయ్ మూడ్ లో కనిపించారు. బయట ఎలా అయితే బర్త్ డే వేడుకలు చేసుకుంటారో బ్యారక్ లో కూడా అలాగే ఎంజాయ్ చేసుకుంటూ వేడుక చేసుకున్నారు.
పలువురు ఖైదీలు హ్యాపీ బర్త్ డే మణి.. అని చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో జైలు అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. బ్యారక్ లో మణి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నట్లు కొందరు ఖైదీలు కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జైలు అధికారులు మణి ఉండే బ్యారక్ అంతా వెతికారు. మణి తన మొబైల్ ఫోన్ ను ధ్వంసం చేసి ఆధారాలు నాశనం చేసినట్లు అధికారులు తెలిపారు.
బర్త్ డే పార్టీలో పాల్గొన్న అందరు ఖైదీలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. జైల్లోని ఖైదీలు మొబైల్ ఫోన్ వాడకుండా మొబైల్ నెట్ వర్క్, ఇంటర్నెట్ ను జామ్ చేసే పరికరాల ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు జైలు అధికారులు తెలిపారు.