Telugu Global
National

లాంగ్ వీకెండ్.. పెరిగిన ట్రావెల్ బుకింగ్స్.. అలా 'ఆజాదీ కా అమృతోత్సవ్'

ఆగస్టు 13 నుంచి 15 వరకు అందరికీ సెలవులు, మాన్‌సూన్ సీజన్ కావడంతో పర్యాటకులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రాఖీ పౌర్ణమి, స్వాతంత్ర దినోత్సవం మధ్య గ్యాప్‌ను అందరూ ట్రావెలింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

లాంగ్ వీకెండ్.. పెరిగిన ట్రావెల్ బుకింగ్స్.. అలా ఆజాదీ కా అమృతోత్సవ్
X

దేశం 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాలు 'ఆజాదీ కా అమృతోత్సవ్' పేరిట జరుపుకుంటోంది. సోషల్ మీడియా డీపీలు మార్చాలని, ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే దేశంలోని యువత, ఉద్యోగులు, కొత్త జంటల ప్లాన్స్ వేరే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నెల రెండో వారం లాంగ్ వీకెండ్ రావడంతో అందరూ టూర్లు వేయడానికి సిద్దపడుతున్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా దేశీయ ప్రయాణాలు తగ్గిపోయాయి. టూరిజం కూడా అంచనాలను అందుకోలేకపోతుంది. ఈ క్రమంలో వచ్చిన లాంగ్ వీకెండ్‌ను ట్రావెల్ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి.

ఆగస్టు 13 నుంచి 15 వరకు అందరికీ సెలవులు, మాన్‌సూన్ సీజన్ కావడంతో పర్యాటకులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రాఖీ పౌర్ణమి, స్వాతంత్ర దినోత్సవం మధ్య గ్యాప్‌ను అందరూ ట్రావెలింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నడూ లేనంతగా ఈ వీకెండ్‌లో రెండింతల బుకింగ్స్ పెరిగినట్లు SOTC ట్రావెల్ కంట్రీ హెడ్, ప్రెసిడెంట్ డానియల్ డిసౌజా వెల్లడించారు. ఈ లాంగ్ వీకెండ్‌లో దగ్గర్లో ఉండే ప్రదేశాల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇష్టపడుతున్నట్లు ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్ రికాంత్ పేర్కొన్నారు. గోవా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, కూర్గ్, కేరళ ప్రాంతాలకు వెళ్లడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

ఈ మాన్‌సూన్ సీజన్‌లో చాలా మంది తాము నివసించే ప్రదేశానికి వెలుపల.. దగ్గరగా ఉన్న మంచి ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారని.. బుకింగ్స్ కూడా అలాగే జరుగుతున్నట్లు తెలిపారు. 50 శాతం బుకింగ్స్ మాన్‌సూన్ ట్రిప్స్‌కు సంబంధించినవే ఉంటున్నాయని ఓయో ఒక నివేదికలో తెలిపింది. లీజర్ డెస్టినేషన్స్‌గా పేరున్న లోనావాలా, ఉదయ్‌పూర్, ఊటీ, పాండిచ్చెరికు 15 శాతం బుకింగ్స్ పెరిగినట్లు తెలుస్తుంది. సింపుల్‌గా ఉండే ప్రదేశాలను ఎంచుకొని, కొన్నాళ్లు తీరికగా గడపగలిగే లీజర్ డెస్టినేషన్స్‌కు ఈ లాంగ్ వీకెండ్‌లో 15 శాతం బుకింగ్స్ పెరిగాయి. ముఖ్యంగా రూ. 10వేల కంటే తక్కువ ఖర్చు ఉండే హోటల్స్‌ను చాలా మంది ఎంచుకుంటున్నారు.

వీకెండ్స్‌ అనగానే చాలా మంది గోవా, ఉదయ్‌పూర్, కూర్గ్ వంటి ప్రదేశాలకు ఎక్కువగా వెళ్తుంటారని goSTOPSలో ఈ ప్రదేశాలకే బుకింగ్స్ అవుతుంటాయని ఫౌండర్ పల్లవి అగర్వాల్ చెప్పారు. ఈ వీకెండ్‌కు కూడా 100 శాతం బుకింగ్స్ చేశామని ఆమె తెలిపారు. ఇక రిషికేశ్, పాలంపూర్, నగార్, కేసర్ దేవి, నైనిటాల్ ప్రాంతాలకు కూడా ఎక్కువ మంది వెళ్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ సారి వర్షాలు భారీగా కురవడంతో కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉంటాయనే భయంతో చాలా మంది హిల్ స్టేషన్స్‌ను ఎంచుకోవడం లేదని తెలుస్తుంది. దగ్గర్లో ఉండే టూరిస్టు ప్రదేశాలైతే త్వరగా వెళ్లి రావడానికి వీలుంటుందని భావించడం వల్లే వీటికి బుకింగ్స్ పెరుగుతున్నాయి. వీకెండ్ వల్ల అందరికీ లీవ్స్ దొరకడం, స్నేహితులు, బంధువులతో కూడా ట్రిప్స్ వేస్తున్నారు. ఏదేమైనా రెండేళ్ల తర్వాత ఒక వీకెండ్‌కు చాలా డిమాండ్ పెరిగిందని మాత్రం ట్రావెల్ ఏజెన్సీలు తెలియజేస్తున్నాయి.

First Published:  1 Aug 2022 4:22 PM IST
Next Story