ఏడు విడతల్లో సుదీర్ఘ షెడ్యూల్.. జూన్ 4న ఫలితాలు
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నాలుగో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఏపీ అసెంబ్లీతోపాటు, ఏపీ, తెలంగాణలో లోక్ సభ స్థానాలకు కూడా మే-13న పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది.
2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగబోతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో పోలింగ్ చేపట్టేందుకు ఈసీ నిర్ణయించింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ మొదలైతే.. ఏడో విడత జూన్ 1న జరుగుతుంది. అంటే తొలిదశ, చివరి దశ పోలింగ్ మధ్యలో 52 రోజుల గ్యాప్ ఉంది. చివరిగా జూన్-4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఈరోజు నుంచి కోడ్ అమలులోకి వచ్చినట్టయింది.
Watch LIVE : Press Conference by Election Commission to announce schedule for General Elections 2024 to Lok Sabha & State Assemblies https://t.co/M8MRkdUdod
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
లోక్ సభ, అసెంబ్లీ, ఉప ఎన్నికలు కూడా..
లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. ఇందులో తెలంగాణ నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాలకు నాలుగోదశలో..
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నాలుగో దశలో ఎన్నికలు జరుగుతాయి. నాలుగో దశకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదలవుతుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 జరుగుతుంది, ఉపసంహరణకు ఆఖరు తేదీ ఏప్రిల్ 29గా నిర్ణయించారు. ఇక ఏపీ అసెంబ్లీతోపాటు, ఏపీ, తెలంగాణలో లోక్ సభ స్థానాలకు కూడా మే-13న పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది. జూన్-4 దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.