Telugu Global
National

రాహుల్ ని వెంటాడుతున్న కేంద్రం.. ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం

లోక్ సభ హౌసింగ్ కమిటీ రాహుల్ కు నోటీసులు పంపించింది. ఏప్రిల్‌ 22లోగా తుగ్లక్ లేన్ లోని అధికారిక బంగ్లా ఖాళీ చేసి బయటకు వెళ్లిపోవాలని సూచించింది.

రాహుల్ ని వెంటాడుతున్న కేంద్రం.. ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం
X

కోర్టులో అలా శిక్ష పడిందో లేదో ఇలా లోక్‌ సభ సభ్యత్వాన్నిరద్దు చేసి రాహుల్ గాంధీకి షాకిచ్చిన కేంద్రం.. ఇప్పుడు మరింత స్పీడ్ పెంచింది. లోక్ సభ సభ్యుడిగా రాహుల్ గాంధీకి ఉండే అన్ని ప్రయోజనాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వాటన్నిటిని ఒక్కొక్కటిగా రద్దు చేయబోతున్నారు. ముందుగా ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులిచ్చారు.

ఢిల్లీలోని 12- తుగ్లక్‌ లేన్‌ లో అధికారిక బంగ్లాలో ప్రస్తుతం రాహుల్ ఉంటున్నారు. లోక్ సభ సభ్యుడిగా ఆయనకు దాన్ని కేటాయించారు. ఇప్పుడు రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలనే డిమాండ్లు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ హౌసింగ్ కమిటీ ఆయనకు నోటీసులు పంపించింది. ఏప్రిల్‌ 22లోగా తుగ్లక్ లేన్ లోని అధికారిక బంగ్లా ఖాళీ చేసి బయటకు వెళ్లిపోవాలని సూచించింది. అన్ని విభాగాలకు ఈ నోటీసుల కాపీని పంపించారు.

టార్గెట్ రాహుల్..

ఒక వ్యూహం ప్రకారమే కేంద్రం ఇలాంటి చర్యలు చేపడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీ నివాసాన్ని ఖాళీ చేయించడానికి అంత తొందరెందుకని ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానం ఈ కేసులో తీర్పుని సవరిస్తే రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దుకాదని, అంతలోనే బంగ్లా వరకు ఎందుకు వెళ్లారంటున్నారు.

నిబంధనల ప్రకారం సభ్యత్వం రద్దయిన నెలరోజుల లోపు అధికార నివాసాన్ని రాహుల్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాహుల్‌ గాంధీ మరికొంత సమయం అడిగితే లోక్‌ సభ హౌసింగ్‌ కమిటీ ఆ విజ్ఞప్తిని పరిశీలించి, తగిన కారణాలుంటే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పటికే సభ్యత్వం రద్దు విషయంలో తన ప్రశ్నలకు లోక్ సభ స్పీకర్ సమాధానం చెప్పలేదని, కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని రాహుల్ చెప్పారు. బంగ్లా విషయంలో కూడా అదే వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది.

First Published:  28 March 2023 5:57 AM IST
Next Story