Telugu Global
National

పేరు గొప్ప - ఊరు దిబ్బ పేదలకు అందని గుజరాత్‌ అభివృద్ధి ఫలాలు

గుజరాత్‌ మోడల్‌ గురించి బిజెపి పరివారం పదేపదే వల్లిస్తుంది. గత రెండు దశాబ్దాల కాలంలో గుజరాత్‌లో జరిగిన అభివృద్ధి ఎవరికి లాభించింది, ఎవరికి మేలు చేకూర్చిందన్నవే అసలు ప్రశ్నలు.

పేరు గొప్ప - ఊరు దిబ్బ  పేదలకు అందని గుజరాత్‌ అభివృద్ధి ఫలాలు
X

అభివృద్ధి చెందగానే సరిపోదు, సంపదలు పెరగగానే చాలదు, వాటి ఫలాలు పేదలకు అందడమే పురోగతికి సార్థకత. దీనికి భిన్నమైన దృశ్యం గుజరాత్‌లో కనిపిస్తున్నది. ఈ గుజరాత్‌ను తామే అభివృద్ధి చేశామని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా చెప్పుకుంటున్నారు. గుజరాత్‌ మోడల్‌ గురించి బిజెపి పరివారం పదేపదే వల్లిస్తుంది. గత రెండు దశాబ్దాల కాలంలో గుజరాత్‌లో జరిగిన అభివృద్ధి ఎవరికి లాభించింది, ఎవరికి మేలు చేకూర్చిందన్నవే అసలు ప్రశ్నలు.

తమ పాలనలో గుజరాత్‌ అప్రతిహత ప్రగతిని సాధించిందని మోడీ, షాలు ఎన్నికల ప్రచారంలో గొంతు చించుకుని చెబుతున్నారు. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పాతికేళ్ళలో పరిశ్రమలు పెరిగాయి. పోర్టులు, రోడ్లు విస్తరించాయి. పారిశ్రామిక ఉత్పత్తులు ఇనుమడించాయి. అభివృద్ధి రేటు పెరిగింది. కానీ వాటి ఫలితాలు సామాన్యులకు అందకపోవడంతో అసమానతలు ఇనుమడించాయి.

గుజరాత్‌ అవినీతి రహిత రాష్ట్రం అని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. నిజానికి పెచ్చరిల్లిన అవినీతి వల్లనే ప్రాజెక్టులు నాసిరకంగా తయారయ్యాయి. గుజరాత్‌లో మోర్బీ బ్రిడ్జి కూలిపోయి దాదాపు 130 మందికి పైగా చనిపోయారు. ఈ బ్రిడ్జి పునర్నిర్మాణంలో జరిగిన అవినీతే ఈ దుర్ఘటనకు మూలం. అక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో మోర్బీ బ్రిడ్జి నిర్మాణంలోని నిర్లక్ష్యం, పట్టించుకోని అధికారుల అలసత్వం బిజెపి పాలన తీరుతెన్నులకు దాఖలా.

ఈ దుర్ఘటనలో గాయాల పాలైన‌వారిని పరామర్శించడానికి నరేంద్ర మోడీ వచ్చే ముందురోజు రాత్రి రోగులున్నప్రభుత్వ ఆస్పత్రికి హడావిడిగా రంగులు వేయడం పాలన ఎంత నాసిరకంగా ఉన్నదో తెలియజేస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల మీద, మొత్తం ఆరోగ్య రంగం మీద గుజరాత్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం అనూహ్యం. కోవిడ్‌-19 కల్లోలంలో ప్రభుత్వ వైఫల్యం తేటతెల్లమైంది. కరోనా బాధితులను ఆదుకోడంలో, కనీస వైద్య సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ విఫలమైంది. ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం తీరుపై ఇప్పటికీ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్న నిధులు 1 శాతం కన్నా తక్కువే. 2019-2020లో వైద్య రంగానికి కేటాయించిన నిధులు రూ.1,067.44 కోట్లు కాగా, 2020-21 సంవత్సరంలో ఈ రంగానికి కేటాయించింది రూ.726.80 కోట్లు మాత్రమే. కోవిడ్‌ విజృంభణ తరువాత ఆరోగ్య రంగానికి నిధులు పెంచాల్సింది పోయి తగ్గించింది ప్రభుత్వం. ప్రజారోగ్యం పట్ల వారికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఈ గణాంకాలే సాక్ష్యం. ప్రభుత్వ ఆస్పత్రులలో కనీస వసతులు లేక జనాలు అల్లాడుతున్నారు.

ఆరోగ్య రంగమే కాదు విద్యారంగంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గుజరాత్‌లో అక్షరాస్యత 78 శాతం మాత్రమే. ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్ల కొరత అధికం. 700 ప్రభుత్వ పాఠశాలలు కేవలం ఒకే ఒక్క టీచర్‌తో నడుస్తున్నాయి. ఆ ఉపాధ్యాయుడే 1 నుంచి 8 వ తరగతి వరకు అన్ని సబ్జక్టులు బోధించాల్సిన పరిస్థితి దయనీయం. కనుకనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. గత రెండేళ్ళలో 86 స్కూళ్ళను మూసివేశారు. మరో 491 స్కూళ్ళను ఇతర స్కూళ్ళలో విలీనం చేశారు. గుజరాత్‌ శాసనసభకు రాష్ట్ర స్కూళ్ళ పరిస్థితిపై సమర్పించిన నివేదికలోని అంశాలివి. చాలా స్కూళ్ళు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించిన విద్యా సహాయకుల (అసిస్టెంట్‌ టీచర్లు)తో నడుస్తున్నాయి. పర్మనెంట్‌ టీచర్ల నియామకం చేపట్టకుండా కాలం సాగదీస్తున్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు 2.5 శాతం కన్నా తక్కువ. విద్యారంగ పురోభివృద్ధి కోసం బడ్జెట్‌లో 6 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్‌ ఏనాడో చెప్పింది. కానీ విద్యారంగం మీద బిజెపి ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టలేదు.

పారిశ్రామిక పురోగతిలో గుజరాత్‌ ముందు ఉన్నదనే మాట వాస్తవమే. కానీ కనీస వేతనాల చట్టం అమలు శూన్యం. రోజువారీ కూలీల వేతనాలు చాలా తక్కువ. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం గుజరాత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కూలీల దినసరి వేతనం కేవలం 239.30 రూపాయలు. ఇదే కేరళలో అయితే దినసరి వేతనం 677 రూపాయలు. జాతీయ సగటు వేతనం 315 రూపాయలు. ఇక జాతీయ వేతనాల నివేదిక -2018 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పనిచేసే కూలీల దినసరి సగటు వేతనం 320 రూపాయలు. ఇదే సమయాన హర్యానాలో పనిచేసే దినసరి కూలీ 783 రూపాయలు అందుకుంటున్నాడు. జాతీయ సగటు వేతనం 449 రూపాయలు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే గుజరాత్‌లో చెమట చిందించే శ్రామికులకు అందుతున్న వేతనాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి.

పారిశ్రామికవేత్తలకు, మౌలిక సదుపాయాల రంగంలో విభిన్న ప్రాజెక్టులు చేపట్టేవారికి గుజరాత్‌ స్వర్గథామమే. వారికి అనేక రాయితీలు, సౌలభ్యాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలకు సానుకూలంగా గుజరాత్‌ నిలిచిందన్నది నిజమే. కానీ బిజెపి పాలకులు చెబుతున్న గుజరాత్‌ మోడల్‌లో సామాన్యుల బతుకులు మెరుగుపడలేదు. రెక్కల కష్టమ్మీద బతికే వారికి ఒరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వ ఆస్పత్రులను, విద్యాలయాలను నమ్ముకున్న వారి బతుకు కనాకష్టం. అందుకే అభివృద్ధి గురించి చాటుకోలేక, భావోద్వేగాల చెరలాటతో గుజరాత్‌లో మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది బిజెపి. ఘనమైన అభివృద్ధి ఫలితాలు సామాన్యులకు అందనందునే వ్యతిరేక పవనాల నడుమ గెలుపు కోసం కుటిల వ్యూహాలెన్నిటినో అనుసరిస్తున్నది కాషాయ పరివారం.

First Published:  28 Nov 2022 5:07 PM IST
Next Story