Telugu Global
National

అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్.. ఇప్పటి వరకు పని చేసిన నాన్-గాంధీ ఫ్యామిలీ వ్యక్తులు వీళ్లే

1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టారు. ఆమె హయాంలో 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టింది.

అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్.. ఇప్పటి వరకు పని చేసిన నాన్-గాంధీ ఫ్యామిలీ వ్యక్తులు వీళ్లే
X

ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం పోలింగ్ అనివార్యం అయ్యింది. రెండు దశాబ్దాల అనంతరం తొలి సారిగా గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈ ఎన్నిక బరిలో లేకపోవడం విశేషం. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే, ఎంపీ శశిథరూర్ ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఖర్గేకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు, గాంధీ ఫ్యామిలీ సపోర్ట్ ఆయనకు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 17 (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.

పోలింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ వివరాల మేరకు.. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల్లో ఓటు వేయడానికి ఏర్పాట్లు జరిగాయి. 36 పోలింగ్ స్టేషన్లలో 67 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కోట్లాది మంది క్రియా శీలక సభ్యులు ఉన్నా.. కేవలం 9 వేల మంది ప్రతినిధులకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. ఇప్పటికే ఓటు వేయాల్సిన ప్రతినిధులందరికీ క్యూఆర్ కోడ్ ఉన్న ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేశారు. కేవలం ఈ కార్డు ఉన్న వారిని మాత్రమే పోలింగ్ స్టేషన్‌లోనికి అనుమతించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్ర ఇంచార్జీలు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు అందరూ అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ సహా 47 మంది ఏఐసీసీ ప్రతినిధుల కోసం క్యాంప్ సైట్‌లో ప్రత్యేకంగా బూత్‌ను ఏర్పాటు చేశారు. వీరందరూ అక్కడే ఓటు వేయనున్నారు. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఈ ఎన్నిక జరుగనున్నది. దీనికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్లకు చేరవేశారు. ఎవరు ఎవరికి ఓటు వేశారనే విషయం ఏ మాత్రం తెలియదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

1947 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన నాన్-గాంధీ కుటుంబ సభ్యులు..

1. జేబీ. క్రిపలాని (1947)

2. భోగరాజు పట్టాభి సీతారామయ్య (1948-1949)

3. పురుషోత్తమ్ దాస్ టాండన్ (1950)

4. యూఎన్. ధేబర్ (1955-1959)

5. నీలం సంజీవరెడ్డి (1960-1963)

6. కే. కామరాజ్ (1964-1967)

7. ఎస్. నిజలింగప్ప (1968-1969)

8. బాబూ జగ్జీవన్ రామ్ (1970-1971)

9. శంకర్ దయాల్ శర్మ (1972-1974)

10. దేవకాంత బరువా (1975-1977)

11. కాసు బ్రహ్మానంద రెడ్డి (1977-1978)

12. పీవీ. నర్సింహ్మారావు (1992-1996)

13. సీతారాం కేసరి (1996-1998)

1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టారు. ఆమె హయాంలో 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టింది. ఇక మధ్యలో రెండేళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ.. పార్టీని గెలిపించలేక పోవడంతో రాజీనామా చేశారు.

First Published:  16 Oct 2022 11:13 AM IST
Next Story