గుజరాత్‌లో ఆర్టీఐ దరఖాస్తు చేయకుండా 10 మందిపై జీవిత కాల నిషేధం!
ఈ చట్టానికి సంబంధించి ఇటువంటి చర్యలు తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. గుజరాత్ లో వీళ్లు ఈ చట్టం కింద జీవిత కాలంలో దరఖాస్తు చేయరాదంటూ నిషేధించారు. గుజరాత్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈ నిషేధాన్ని విధించింది.
ప్రతిష్టాత్మకమైన, ప్రయోజనకరమైన సమాచార హక్కు చట్టం (రైట్ టు ఇన్ఫర్మేషన్-ఆర్టీఐ) అవహేళనకు గురైంది. చరిత్రలో మొదటిసారి పదిమంది ఆర్టీఐ దరఖాస్తుదారులపై నిషేధం విధించారు. అంతేగాక ఆర్టీఐ కింద దరాఖాస్తు చేసిన ఓ జంటకు రూ.5వేలు జరిమానా విధించారు. ఈ చట్టానికి సంబంధించి ఇటువంటి చర్యలు తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. గుజరాత్ లో వీళ్లు ఈ చట్టం కింద జీవిత కాలంలో దరఖాస్తు చేయరాదంటూ నిషేధించారు. గుజరాత్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈ నిషేధాన్ని విధించింది. 'ప్రభుత్వ అధికారులను వేధించడానికి ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగ పరిచినందుకు ఈ నిషేధం విధిస్తున్నామని పేర్కొన్నారు.
మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజాహత్ హబీబుల్లా మాట్లాడుతూ, "ఈ ఉత్తర్వులు వివాదాస్పదమే కాకుండా పూర్తిగా చట్టవిరుద్ధం. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ఈ ఉత్తర్వులను సవాలు చేయవచ్చు" అన్నారు.
మహితి అధికార్ గుజరాత్ పహెల్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఆర్టీఐ హెల్ప్‌లైన్‌ను నడుపుతోంది. ఈ సంస్థ ఆర్టీఐ దరఖాస్తులు, ప్రతిస్పందనలను అధ్యయనం చేస్తుంది, నిషేధానికి గురైన ఈ మొత్తం పది కేసులను స్టడీ చేసింది. ఈ పదిమందికి వారు దరఖాస్తు చేసుకున్న సమస్యలపై ఎటువంటి సమాచారం అందించవద్దని సమాచార కమిషనర్లు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు అధ్యయనంలో వెల్లడైంది.
ఉదాహరణకు, గాంధీనగర్‌లోని పెథాపూర్‌కు చెందిన అమితా మిశ్రా అనే ఉపాధ్యాయురాలు ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తూ తన సర్వీస్ బుక్ కాపీ, జీతం వివరాల కోసం కోరారు. ఆమె ఒక్కో పేజీకి చెల్లించాల్సిన రూ. 2 ఫీజు చెల్లించడం లేదని, అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతుందని పాఠశాల అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై సమాచార కమిషనర్ కె.ఎం. అధ్వర్యు ఆమె దరఖాస్తులను ఎప్పుడూ స్వీకరించవద్దని జిల్లా విద్యా శాఖాధికారులను ఆదేశించారు. ఆమె జీవితకాలం ఆర్టీఐ ద్వారా దరఖాస్తులను దాఖలు చేయకుండా నిషేధించారు.
మరో కేసులో.. పెట్లాడ్ పట్టణానికి చెందిన దరఖాస్తుదారు హితేష్ పటేల్ అతని భార్య తమ రెసిడెన్షియల్ సొసైటీకి సంబంధించి 13 ప్రశ్నలను ఆర్టీఐ ద్వారా దాఖలు చేసినందుకు రూ. 5,000 జరిమానా విధించారు.
మోదాసా పట్టణంలోని కస్బాకు చెందిన పాఠశాల ఉద్యోగి సత్తార్ మాజిద్ ఖలీఫాపై కూడా జీవితకాలం నిషేధం విధించారు. తనపై పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఆ సంస్థ గురించి ప్రశ్నలు అడగడం వల్లే కమిషన్ ఈ చర్యలు తీసుకుంది. ఖలీఫా తన పాత యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆర్టీఐ కమిషనర్ ఆరోపించారు. పైగా విద్యాశాఖలో పీఆర్వో ను కూడా ఆయన దూషించారని కమిషన్ పేర్కొంది.
ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం పేలవంగా ఉందని తెలుస్తోంది. సమస్యల పరిష్కారంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. అక్టోబర్ 2017 నాటికి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ముందు 37,000 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది పరిస్థితిలో కూడా పెద్దగా మార్పు లేదు. జూలై 18 నాటికి, ఆర్టీఐ చట్టం కింద దాఖలైన 26,518 అప్పీళ్లు, ఫిర్యాదులు సీఐసీ వద్ద క్లియరెన్స్ కోసం పెండింగ్‌లో ఉన్నాయి.