Telugu Global
National

అదానీ గ్రూప్ షేర్ల ధరల పతనం...రూ. 500 కోట్లు నష్టపోయిన LIC

అదానీ కంపెనీలలో LIC హోల్డింగ్ విలువ మరో రూ. 500 కోట్లు క్షీణించింది అని CNBC నివేదించగా, అదానీ స్టాక్స్‌లో కొనసాగుతున్న విక్రయాల వల్ల‌ ఎల్‌ఐసి రూ. 49,728 కోట్ల భారీ నష్టాన్ని చవి చూసిందని బిజినెస్ టుడే పేర్కొంది.

అదానీ గ్రూప్ షేర్ల ధరల పతనం...రూ. 500 కోట్లు నష్టపోయిన LIC
X

ఫిబ్రవరి 23, గురువారం ట్రేడ్ ముగిసే సమయానికి, అదానీ గ్రూప్ షేర్ల ధరల పతనం వల్ల ఆ సంస్థలో అతి పెద్ద సంస్థాగత పెట్టుబడిదారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెట్టుబడులు రూ. 500 కోట్ల మేర నష్టపోయాయి.

"అదానీ కంపెనీలలో LIC హోల్డింగ్ విలువ మరో రూ. 500 కోట్లు క్షీణించింది" అని CNBC నివేదించింది.అదానీ గ్రూపులో ఎల్‌ఐసి తన పెట్టుబడులపై గురువారం మధ్యాహ్నానికి రూ. 500 కోట్లు నష్టపోయిందనిపేర్కొంది.

అదానీ స్టాక్స్‌లో కొనసాగుతున్న విక్రయాల వల్ల‌ ఎల్‌ఐసి రూ. 49,728 కోట్ల భారీ నష్టాన్ని చవి చూసిందని బిజినెస్ టుడే నివేదించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ , స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అంబుజా సిమెంట్స్, ACC లలో ఎల్‌ఐసి పెట్టుబడి సంచిత మార్కెట్ విలువ డిసెంబర్ 30, 2022 నాటికి దాదాపు రూ. 82,970 కోట్లు కాగా,

ఫిబ్రవరి 23, 2023 నాటికి దాదాపు రూ. 33,242 కోట్లకు తగ్గింది.

అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడి విలువ క్షీణించడం మొత్తం లాభాల క్షీణతకు అతిపెద్ద కారణమని హిందూ బిజినెస్‌లైన్ పేర్కొంది.

ఇప్పుడు ఎల్‌ఐసి ముందున్న పెద్ద సవాలు ఏమిటంటే, “అదానీ గ్రూప్ స్టాక్‌లలోని పెట్టుబడి వెనక్కి తీసుకోవాలా ? ప్రస్తుత హోల్డింగ్ ల‌ను విక్రయించాలా? అనేది. వారు విక్రయించాలని నిర్ణయించుకుంటే, అదానీ గ్రూప్ స్టాక్స్‌పై మరింత ఒత్తిడిని సృష్టించవచ్చు. ప్రస్తుతమున్న అదానీ గ్రూపు షేర్ల అమ్మకాల‌ ట్రెండ్ మరింతగా పెరగవచ్చు.

కాగా, సెప్టెంబర్ 30, 2022 నాటికి ఎల్‌ఐసి నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ. 41.66 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని, అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసి పెట్టుబడులు 0.975% కంటే తక్కువగా ఉన్నాయని ఎల్‌ఐసి పేర్కొంది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకన్నా ముందే, అదానీ గ్రూప్ షేర్‌లను కొనుగోలు చేయాలనే LIC నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టడం ఏంటనే చర్చ సాగింది.

ఫిబ్రవరి 8వ తేదీన ఎల్‌ఐసి చైర్మన్ ఎం.ఆర్.కుమార్ మాట్లాడుతూ అదానీ గ్రూప్‌లో LIC పెట్టుబ‌డుల‌పై రెండు మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌రిశీలిస్తాన‌ని తెలిపారు. మార్కెట్‌లో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి వారికి (అదానీ) కొంత సమయం ఇవ్వాలి అని ఆయన‌ చెప్పినట్లు సమాచారం.

"వారి బిజినెస్ ప్రొఫైల్,వారు ఏమి చేయాలనుకుంటున్నారు, వారు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? తదితర విషయాలను తెలుసుకోవడానికి వారితో ఎప్పుడైనా మాట్లాడే స్వేచ్చ మాకుంది'' అని LIC చైర్‌పర్సన్ చెప్పారు.

First Published:  24 Feb 2023 8:19 AM IST
Next Story