Telugu Global
National

బీఆర్ఎస్‌ను మనతో కలవమనండి.. నితీశ్‌కు బాధ్యత అప్పగించిన రాహుల్ గాంధీ

మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తో మాట్లాడే బాధ్యతను నితీశ్ కుమార్‌కు అప్పగించారు.

బీఆర్ఎస్‌ను మనతో కలవమనండి.. నితీశ్‌కు బాధ్యత అప్పగించిన రాహుల్ గాంధీ
X

సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలు పొత్తులపై కసరత్తు చేస్తున్నాయి. జాతీయస్థాయిలో బలంగా ఉన్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒక కీలక భేటీ జరిగింది. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక్క తాటిపై తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కీలక భేటీ నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని పోవాలని ఈ భేటీలో నిర్ణయించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, బీహార్ సీఎం నితీశ్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

బీజేపీని వ్యతిరేకిస్తూనే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న పార్టీలను కూడా కూటమిలో కలపడానికి ప్రయత్నించాలని నిర్ణయించారు. ముఖ్యంగా బీఆర్ఎస్, టీఎంసీ పార్టీలు ఈ కూటమిలో చేరితే మరింత బలం చేకూరుతుందని అంచనా వేశారు. మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తో మాట్లాడే బాధ్యతను నితీశ్ కుమార్‌కు అప్పగించారు. కేసీఆర్‌తో ఉన్న పరిచయాల దృష్ట్యా తానే మాట్లాడతానని నితీశ్ ముందుకు వచ్చినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉండటమే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీలతో కలిసి వెళితే.. బీజేపీని ఓడించడం సులువు అవుతుందని వారు అంచనా వేస్తున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడం ఇప్పుడు చాలా అవసరం అని వారు వ్యాఖ్యానించారు. విపక్షలు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా నిర్ణయించారు. డీఎంకే, ఎన్సీపీ పార్టీ నేతలతో మాట్లాడే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదొక చారిత్రాత్మకమైన సమావేశమని.. విపక్షాలను ఐక్యం చేసేందుకు తాము ఒక అడుగు ముందుకు వేశామని రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్ వెల్లడించారు.

బీఆర్ఎస్ కనుక ఈ కూటమిలో చేరితే ప్రతిపక్షాల బలం పెరుగుతుందని అంటున్నారు. అయితే, మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్న సీఎం కేసీఆర్.. వీరి ప్రతిపాదనకు ఏ మేరకు స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. టీఎంసీ, బీఆర్ఎస్, ఆప్ పార్టీలు కలిసి వస్తే.. బీజేపీ వ్యతిరేక పోరు మరింత సులువు అవుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. కాగా, విపక్షాలను ఒక్క తాటిపై తెచ్చేందుకు నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలను ఆప్ అధినేత కేజ్రివాల్ ప్రశంసించారు. ఈ విషయంలో ఆయనకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

First Published:  13 April 2023 8:30 AM IST
Next Story