మాజీమంత్రి, లెజండరీ న్యాయవాది శాంతి భూషణ్ కన్ను మూత!
ఎన్నికల అవకతవకలకు పాల్పడిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా రాజకీయ నాయకుడు రాజ్ నారాయణ్ తరపున శాంతి భూషణ్ కోర్టులో ప్రాతినిధ్యం వహించారు. ఆయన వాదనల వల్లనే ఇందిరా గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు కావడం, తదననంతర పరిణామాలతో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం జరిగాయి.

లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూశారు. తన 97వ ఏట స్వల్ప అనారోగ్యంతో మంగళవారం మరణించారు. ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో భూషణ్ న్యాయశాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
న్యాయవాదిగా, అతను అనేక ముఖ్యమైన కేసులను వాదించారు. అనేక ప్రజా ప్రయోజన కేసులను వాదించారు. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన ఉద్యమకారుడు. ఎన్నికల అవకతవకలకు పాల్పడిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా రాజకీయ నాయకుడు రాజ్ నారాయణ్ తరపున ఆయన కోర్టులో ప్రాతినిధ్యం వహించారు. ఆయన వాదనల వల్లనే ఇందిరా గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు కావడం, తదననంతర పరిణామాలతో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం జరిగాయి.
ఎమర్జెన్సీని ఎత్తివేసి, జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, శాంతి భూషణ్‌ను న్యాయ మంత్రిగా నియమించారు. అతను రాజ్యాంగ (42వ సవరణ) చట్టాన్ని ప్రవేశపెట్టాడు, ఇది ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తీసుకువచ్చిన అనేక నిబంధనలను రద్దు చేసింది.
భూషణ్ కాంగ్రెస్ (ఓ), తరువాత జనతా పార్టీ లో పని చేశారు.. 80వ దశకం ప్రారంభంలో ఆరేళ్లపాటు బీజేపీ సభ్యుడిగా కూడా ఉన్నారు. శాంతి భూషణ్, అతని కుమారుడు ప్రముఖ న్యాయవాదిప్రశాంత్ భూషణ్ ఇద్దరూ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఉన్నారు, కానీ ఆ తర్వాత పార్టీ నుంచి వారు బైటికి వచ్చేశారు.
ప్రశాంత్ భూషణ్ తన తండ్రి మరణం గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, “ఇది ఒక యుగానికి ముగింపు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ పరిణామాన్ని దగ్గరి నుంచి చూసిన వ్యక్తి. కోర్టింగ్ డెస్టినీ, మై సెకండ్ ఇన్నింగ్స్ అనే రెండు పుస్తకాలలో అతను ఈ అనుభవాల గురించి రాశారు. అతని మరణం మనందరికీ తీరని లోటు .” అని అన్నారు.
శాంతి భూషణ్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వ్యవస్థాపకులలో ఒకరు. అతని కుమారుడితో కలిసి ఆయన న్యాయపరమైన జవాబుదారీతనం, న్యాయ సంస్కరణల అంశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.