Telugu Global
National

మన దేశంలోనే...ఆ రాష్ట్రంలో ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటే డబుల్ ఇంక్రిమెంట్లు

సిక్కి‍ం రాష్ట్రంలో స్థానిక జనాబా క్రమక్రమంగా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎక్కువ మంది పిల్లల్ని కనే ప్రభుత్వ ఉద్యోగినులకు అనేక ప్రోత్సహకాలు ప్రకటించారు.

మన దేశంలోనే...ఆ రాష్ట్రంలో ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటే డబుల్ ఇంక్రిమెంట్లు
X

మన దేశం ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న జనాభాతో కిటకిటలాడుతోంది. కొద్ది రోజుల్లో చైనాను కూడా దాటి పోయి ప్రపంచంలో నెంబర్ 1 గా అవతరించబోతోంది. అలాంటి మన దేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కంటే అనేక ప్రోత్సహకాలు ఇస్తున్న రాష్ట్ర‍ం ఉందంటే నమ్ముతారా ? నమ్మాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి.

సిక్కి‍ం రాష్ట్రంలో స్థానిక జనాబా క్రమక్రమంగా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎక్కువ మంది పిల్లల్ని కనే ప్రభుత్వ ఉద్యోగినులకు అనేక ప్రోత్సహకాలు ప్రకటించారు.

సర్వీసులో ఉన్న మహిళలకు 365 రోజుల ప్రసూతి సెలవులు, మగ ఉద్యోగులకు 30 రోజుల పితృత్వ సెలవులను అందించి, పిల్లలను కనేలా తమ ప్రభుత్వం వారిని ప్రోత్సహించిందని ముఖ్యమంత్రి చెప్పారు.

దీంతో పాటు రెండో బిడ్డకు జన్మనిచ్చిన మహిళా ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డను కంటే రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు.

ఒక బిడ్డ మాత్రమే ఉన్న మహిళకు ఈ ఆర్థిక ప్రయోజనం అందుబాటులోకి రాదని తమంగ్ స్పష్టం చేశారు.

ఉద్యోగినులే కాకుండా ఎక్కువమంది పిల్లల్ని కనే సాధారణ ప్రజలు ఆర్థిక సహాయానికి అర్హులు అవుతారని, వీటి వివరాలను ఆరోగ్య, మహిళా శిశు సంరక్షణ శాఖలు త్వరలోనే రూపొందిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.

దక్షిణ సిక్కింలోని జోరెథాంగ్ పట్టణంలో మాఘే సంక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ, సిక్కిం లో "సంతానోత్పత్తి రేటు ఇటీవలి సంవత్సరాలలో బాగా తగ్గిపోయిందని, ఒక మహిళకు ఒక బిడ్డ చొప్పున అత్యల్ప వృద్ధి రేటును నమోదు చేయడంతో స్థానిక కమ్యూనిటీల జనాభా తగ్గిపోయింది'' అని అన్నారు.

"మహిళలతో సహా స్థానిక ప్రజలను మరింత మంది పిల్లలను కనడానికి ప్రోత్సహించడం ద్వారా మేము సంతానోత్పత్తి రేటును పెంచాల్సిన‌ అవసరం ఉంది" అని తమాంగ్ చెప్పారు

తమ ప్రభుత్వం సిక్కింలోని ఆసుపత్రులలో IVF సదుపాయాన్ని ప్రారంభించిందని, మహిళలు సహజంగా గర్భం దాల్చడానికి సమస్యలు ఎదురైనప్పుడు IVF విధానం ద్వారా పిల్లలను కనే తల్లులందరికీ 3 లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తామ‌ని చెప్పారు.

ఐవీఎఫ్ సౌకర్యం ద్వారా ఇప్పటి వరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, వారిలో కొందరు పిల్లల్ని కూడా కన్నారని తెలిపారు.

సిక్కిమీస్ ప్రజలను ఒకే బిడ్డను కనాలని బలవంతం చేసినందుకు గత పవన్ కుమార్ ప్రభుత్వంపై తమాంగ్ విరుచుకుపడ్డారు. తమ సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) ప్రభుత్వం స్థానిక ప్రజలను ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.

సిక్కిం జనాభా ప్రస్తుతం ఏడు లక్షల లోపే ఉంది. అందులో దాదాపు 80 శాతం మంది స్థానిక వర్గాలకు చెందినవారు.

First Published:  17 Jan 2023 3:53 PM IST
Next Story