Telugu Global
National

ఐటీ కంపెనీల్లో లేఆఫ్ లు.. ఊడుతున్న ఉద్యోగాలు

జనవరి 15వతేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా 91 కంపెనీలు లే ఆఫ్‌ లు ప్రకటించాయి. దీంతో 25 వేల దాకా ఐటీ ఉద్యోగులు ఇంటికెళ్లిపోయారు. అంటే రోజుకి సగటున 1,600 మంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.

ఐటీ కంపెనీల్లో లేఆఫ్ లు.. ఊడుతున్న ఉద్యోగాలు
X

ఆర్థిక మాంద్యం అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు మెడపై కత్తులు వేలాడుతున్నాయి. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనంటూ అందరూ భయం భయంగానే ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ తో కాస్త రిలాక్స్ గా ఉన్న టెకీలు మాంద్యం దెబ్బతో ఆందోళనకు గురవుతున్నారు. పేరు గొప్ప కంపెనీలు కూడా ఏమాత్రం మొహమాట పడకుండా లే ఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. దీంతో కంపెనీ మంచిదయినా, కంపెనీతో అనుబంధం గొప్పదయినా ఉద్యోగులు మాత్రం కంగారుపడుతున్నారు.

2022నుంచే మొదలు..

2022 చివర్లో ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. 2023లో అవి కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలలపాటు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఖర్చు తగ్గించుకోడానికి మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లే ఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. 2022లో ప్రపంచంలోని వెయ్యికి పైగా కంపెనీలు మొత్తం 1,54,336 మందిని ఉద్యోగాల్లోనుంచి తీసేశాయి. ఈ ఏడాది ఆ సెంటిమెంట్ కొనసాగింది. జనవరి 15వతేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా 91 కంపెనీలు లే ఆఫ్‌ లు ప్రకటించాయి. దీంతో 25 వేల దాకా ఐటీ ఉద్యోగులు ఇంటికెళ్లిపోయారు. అంటే రోజుకి సగటున 1,600 మంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. పలు స్టార్టప్ కంపెనీలు కూడా మాంద్యె దెబ్బకి ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. లే ఆఫ్స్‌ ట్రాకింగ్‌ సైట్‌ ‘లే ఆఫ్స్‌ FYI’ తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.

ఆర్థికమాంద్యం పరిస్థితులు తలెత్తినప్పుడు మొదటగా ఐటీరంగం ప్రభావితమవుతుంది. ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడానికి ఇదే అసలు కారణం. మాంద్యం మొదలైంది అనడానికి ఇదే సంకేతం అని అంటున్నారు. 2001లోనూ ఇలాంటి పరిస్థితులతో ఇండియన్‌ ఐటీ కంపెనీలకు ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌లు తగ్గిపోయాయి. ఇప్పుడు కూడా అలాంటి సంకేతాలు వెలువడుతున్నాయి. కాంట్రాక్ట్ లు తగ్గిపోవడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని వదిలించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. క్యాంపస్‌ సెలక్షన్లలో భాగంగా ఎంపిక చేసుకున్నవారి నియామక ఉత్తర్వులను సైతం కొన్ని సంస్థలు రద్దు చేస్తున్నాయి.

పెద్ద పెద్ద కంపెనీలు కూడా..

దేశీయ సోషల్ మీడియా కంపెనీ షేర్‌చాట్‌ 20 శాతం ఉద్యోగుల్ని తగ్గించుకుంది. ట్విట్టర్, గూగుల్ సహా ఇతర గ్లోబల్‌ కంపెనీలు 2,300 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఓలా రీసెంట్ గా 200 మందిని తొలగించింది. వాయిస్‌ ఆటోమేటెడ్‌ స్టార్టప్‌ కంపెనీ స్కిట్‌ ఏఐ ఈ నెలలో తొలగింపులు మొదలు పెట్టింది. సరుకులను డోర్ డెలివరీ చేసే ‘డంజో’ సంస్థ కూడా ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పేసింది. అమెజాన్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 18 వేల మందిని తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మిగతా కంపెనీల ఉద్యోగులు కూడా టెన్షన్ పడుతున్నారు. జీతాలకోసం కంపెనీలు మారే సాహసం కూడా చేయడంలేదు. ఆరు నెలలు కచ్చితంగా ఈ ప్రభావం ఉంటుంది, ఆ తర్వాత ఇంకెంతకాలం ఉంటుందో ఆర్థిక మాంద్యం పరిస్థితిని బట్టి అంచనా వేయొచ్చు.

First Published:  20 Jan 2023 9:48 AM IST
Next Story